సీఎం సార్.. నిందితుడిని అరెస్ట్ చేయరా.. ఇది బేటీ బచావోనా ? బేటా బచావోనా ??
బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా విచారణ పారదర్శకంగా జరగాలని డీజీపీకి సూచించారు. దాంతో ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ఈ సిట్ విచారణ కొనసాగుతోంది. ఓవైపు రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో స్పందిస్తుండగా.. పలువురు ప్రముఖులు సైతం ఈ ఘటనపై స్పందిస్తున్నారు.
తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూ ప్రశ్నలు సంధించారు. బాలికను వేధించారనే ఆరోపణలపై కేసు నమోదై ఇన్ని రోజులవుతున్నా.. నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నినదించే "బేటీ బచావో.. బేటీ పడావో" నినాదాన్ని గుర్తు చేస్తూ.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇది "బేటా బచావో" లాగా కనిపిస్తోందని విమర్శించారు. ఈ మేరకు "బండి ఎక్కి పారిపోయిన అమానుష బండిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు...?" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక ఇప్పటికే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనపై 'హనీ ట్రాప్' జరిగిందంటూ బండి భగీరథ్ కరీంనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విపక్షాలు, మహిళా సంఘాలు సైతం బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలనే డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలి స్టేట్ మెంట్ కూడా రికార్డ్ చేసినట్లు సమాచారం. బండి భగీరథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు బండి భగీరథ్ కనిపించడం లేదంటూ నగరంలోని పలు ప్రాంతాల్లో వెలసిన పోస్టర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మెట్రో పిల్లర్లు, బస్టాప్‌లు, ప్రధాన కూడళ్లలో "బండి భగీరథ్ ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్‌లో చెప్పండి" అంటూ ఈ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. దీంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో ఈ అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. దీంతో ఈ కేసు విషయం రాష్ట్రవ్యాప్తం గానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపుతోంది.
బండి ఎక్కి పారిపోయిన అమానుష బండిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు?
— Prakash Raj (@prakashraaj) May 12, 2026
బేటి బచావ్ వదిలేసి, బేటా బచావ్ ఏంటి?#justasking
🚨 బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు అంటూ వెలసిన పోస్టర్లు..
— Telugu Reporter (@TeluguReporter_) May 13, 2026
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకు, పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదు.. ఆచూకీ తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో తెలియచేయండి అంటూ హైదరాబాద్ వ్యాప్తంగా పోస్టర్లు దర్శనమిచ్చాయి.#Telangana #BandiSanjay pic.twitter.com/6VReAm7eu2












Click it and Unblock the Notifications