నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం: మంత్రి హరీశ్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని బుద్వేలులో తాము కొనుగోలు చేసిన స్థలంపై దుష్ప్రచారం చేస్తున్నారని బగారా క్యాటరింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ గండ్ర ప్రవీణ్‌రావు అన్నారు. ఓ మీడియా సంస్థ అవాస్తవాలను ప్రచారం చేసిందని అన్నారు.
బుద్వేలు స్థలంలో గుడి, మసీదు ఉన్నాయని, వాటిని ధ్వంసం చేశామన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ స్థల వివాదంపై ఎలాంటి న్యాయ విచారణకైనా తాను సిద్ధమేనని, తప్పు చేశామని రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. ఈ స్ధలం విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులకు అనవసరంగా సంబంధాన్ని అంటగడుతున్నారని గండ్ర ప్రవీణ్‌రావు ఆరోపించారు.

ప్రైవేటు వ్యక్తుల దగ్గర సర్వేనంబర్ 310, 311, 312లోని 39.11 ఎకరాలు కొనుగోలు చేసిన స్థలంపై అన్ని హక్కులు తమవేనని శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు తెలిపారు. తాను సీఎం కేసీఆర్‌కు బంధువునని, మంత్రి హరీశ్‌రావు భాగస్వామినంటూ ప్రచారం చేయడం తగదన్నారు.

హక్కులను పొందడంలో సీఎం కేసీఆర్ గానీ, మంత్రి హరీశ్‌రావుగానీ ఏ ఇతర మంత్రులు, అధికారులుగానీ సిఫారసు చేయలేదని స్పష్టంచేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వారికి ఎలాంటి సంబంధం, భాగస్వామ్యం లేదన్నారు. చాలాకాలం క్రితమే భూమిని తాము పట్టాదారుల నుంచి కొనుగోలు చేశామంటూ, అందుకు సంబంధించిన పత్రాలను మీడియాకు చూపెట్టారు.
నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం: మంత్రి హరీశ్
రంగారెడ్డి జిల్లా బుద్వేలు భూవివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నీటి పారుదల శాఖ మంత్రి హారీశ్ రావు స్పష్టం చేశారు. ఆ భూవివాదంలో ప్రవీణ్ రావును తాను రక్షించాననిగానీ, దానిలో తన ప్రమేయం ఉందని గానీ నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దమని ప్రకటించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారులోని రాజేంద్ర నగర్ భూదౌర్జన్యాలపై ప్రభుత్వం స్పందించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. 40 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న ప్రవీణ్ రావు అక్రమాలను అడ్డుకోవాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నారని ఆయన విమర్శించారు. శ్మశానాలను, ప్రార్థనా స్థలాలను కూడా ఆక్రమిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత నెల 22వ తేదీన కేసు నమోదు అయితే ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన అడిగారు. ప్రవీణ్ రావు అరెస్టును అడ్డుకున్నదెవరో బయటకు రావాలని ఆయన అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications