స్మితా సబర్వాల్‌ను తొలగించాలంటూ ట్యాంక్‌బండ్ వద్ద భారీ నిరసన
హైదరాబాద్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో స్మితా సబర్వాల్ వ్యాఖ్యలకు నిరసనగా లోయర్ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యల చేసి అవమానించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను వెంటనే తొలగించాలని, అరెస్ట్ కూడా చేయాలని డిమాండ్ చేసింది దివ్యాంగుల హక్కుల వేదిక. జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. స్మితా సబర్వాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాగా, దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మితా సభర్వాల్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఉన్నతస్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడ్డారు.
మరోవైపు, స్మితా సభర్వాల్‌పై సీఎస్బీ ఐఏఎస్అకాడమీ ఛైర్మన్ బాలలత ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దివ్యాంగులందరికీ స్మితా సభర్వాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్స్‌లో ఆమె పెట్టిన ట్వీట్తొలగించకపోతే అమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. అనంతరం బాలలత స్మితా సభర్వాల్‌కు ఇద్దరం సివిల్ పరీక్షలు రాద్దాం అంటూ సవాల్ విసిరారు.
ఈ క్రమంలో స్పందించిన స్మితా సభర్వాల్..సివిల్స్ పరీక్ష రాసేందుకు మళ్లీ తాను సిద్ధమేనని, కానీ వయో పరిమితి దాటినందున పరీక్ష రాసేందుకు యూపీఎస్సీ అనుమతిస్తుందా? అనే అనుమానం ఉందన్నారు. దివ్యాంగుల కోటాలో ఉద్యోగం పొందిన బాలలతకు ఆ జాబ్, ఫీల్డ్ వర్క్‌తో ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడిందా? లేక కోచింగ్ కేంద్రం నడపడానికా? అంటూ ప్రశ్నించారు. మరోవైపు స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి.












Click it and Unblock the Notifications