ఉమెన్స్ హాస్టల్లో ఉన్మాది కలకలం: అర్ధరాత్రి దుస్తులిప్పేసి అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: ఓ వ్యక్తి మంగళవారం అర్థరాత్రి మహిళా హాస్టల్లోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నం కలకలం రేపింది. నగరంలోని ఖైరతాబాద్ మార్కెట్ వీధిలోని ఏఐడబ్ల్యూసీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోకి మంగళవారం రాత్రి 11గంటల సమయంలో అనుమానాస్పద వ్యక్తి గోడదూకి లోపలికి చొరబడేందుకు యత్నించాడు.
ఆ ఉన్మాది గోడపైకి ఎక్కి అసభ్యకరంగా ప్రవర్తించాడని, వారం రోజులుగా అర్థరాత్రి వేళ గోడదూకి లోపలికి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాడని మహిళలు తెలిపారు. అంతేగాక, ఆ ఉన్మాది తన ఒంటిపై దుస్తుల్ని విప్పేసుకుని ఉన్మాదంతో వ్యవహరిస్తున్నాడని మహిళలు చెప్పారు.
ఆగంతకుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, బెదిరించడంతో హాస్టల్లోని మహిళలు భయాందోళనకు గురయ్యారు. వారం రోజులుగా పోలీసులకు సమాచారం అందిస్తున్నా.. సకాలంలో రావడం లేదని మహిళలు ఆరోపించారు.

ఉన్మాదిని చాకచక్యంగా పట్టుకోవాల్సిన పోలీసులు సైరన్ మోగిస్తూ వస్తుండటంతో దుండగుడు అక్కడ్నుంచి తప్పించుకుంటున్నాడని మహిళలు వాపోయారు.
కాగా, గత సంవత్సరం కూడా ఇదే వసతిగృహంలో చొరబడేందకు ప్రయత్నించిన ఓ ఉన్మాదిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. 50 నుంచి 60 మంది మహిళలు ఆశ్రయం పొందుతున్న ఈ హాస్టల్‌కి వాచ్‌మెన్ కూడా లేకపోవడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు సరైన సమయంలో స్పందించి ఆ ఉన్మాదిని పట్టుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications