Teenmar Mallanna: ఆ కేసులో తీన్మార్ మల్లన్న అరెస్ట్... హుజురాబాద్‌లో పాదయాత్రకు 2 రోజుల ముందు...
యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం(ఆగస్టు 27) చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో విచారణ అనంతరం మల్లన్నను అరెస్ట్ చేశారు.లక్ష్మీకాంత శర్మ అనే ఓ జ్యోతిష్యుడి నుంచి రూ.30లక్షలు డిమాండ్ చేయడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మల్లన్నను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మల్లన్న అరెస్టును ఆయన మద్దతుదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీసులు మాత్రం తాము చట్ట పరిధిలోనే వ్యవహరిస్తున్నామని చెబుతున్నారు.

మల్లన్నపై లక్ష్మీకాంత శర్మ కేసు...
మల్లన్న నిర్వహించే క్యూ న్యూస్ ఛానెల్‌లో కొద్దిరోజుల పాటు లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడిపై వరుస కథనాలు ప్రసారం చేశారు. జ్యోతిష్యం పేరుతో లక్ష్మీకాంత శర్మ చాలామందిని మోసం చేశారని అందులో ఆరోపించారు. బాధితులుగా చెబుతున్న కొంతమందితో ఛానెల్‌లో మాట్లాడించారు. ఇదే క్రమంలో లక్ష్మీకాంత శర్మ మల్లన్నపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లన్న తన నుంచి రూ.30లక్షలు డిమాండ్ చేశారని... కొందరు నకిలీ భక్తులను తన వద్దకు పంపి ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.డబ్బులు ఇచ్చేందుకు తాను నిరాకరించడం వల్లే తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేశాడని ఆరోపించారు.

ఇటీవలే టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ల కేసు....
మల్లన్నపై చిలకలగూడ పోలీస్ స్టేషన్‌తో సైబర్ క్రైమ్ స్టేషన్,చిక్కడపల్లి,జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఇటీవల టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ... చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. చట్టపరంగా మల్లన్నపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరినట్లు తెలిపారు. ఇకనైనా పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. పద్దతి మార్చుకోకపోతే తాము మల్లన్న కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుందన్నారు.మరో టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌పై నవీన్ అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని...
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అసభ్య పదజాలంతో మల్లన్న సవాల్ విసరడం వివాదాస్పదంగా మారింది. నిజానికి మల్లన్నపై ఉన్న ప్రధాన ఆరోపణలు,అభ్యంతరాలు ఆయన అధికార పార్టీ నేతల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే. ముఖ్యంగా కేసీఆర్,కేటీఆర్,వారి కుటుంబ సభ్యులను,మంత్రులను ఆయన సంబోధించే తీరుపై విమర్శలున్నాయి. జర్నలిస్ట్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదనే అభిప్రాయాలున్నాయి. అయితే కేసీఆర్ భాషలోనే తాను మాట్లాడుతున్నానని... తాను మాట్లాడుతున్న దానిలో తప్పేమీ లేదని పలుమార్లు మల్లన్న తనను తాను సమర్థించుకున్నారు.

పాదయాత్రకు ముందు అరెస్ట్...
మల్లన్న ఈ నెల 29 నుంచి పాదయాత్ర ప్లాన్ చేసుకున్నారు. నిజానికి ఆలంపూర్ నుంచి ప్రారంభించాల్సిన ఈ పాదయాత్ర అనూహ్యంగా హుజురాబాద్‌కు మార్చినట్లు చెబుతున్నారు. మల్లన్న పాదయాత్రను అడ్డుకునేందుకే ఆయన్ను అరెస్ట్ చేశారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. గత కొద్దిరోజులుగా మల్లన్న ఏదో ఒక కేసులో తరుచూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇదే క్రమంలో ఆయన అరెస్ట్ జరగడం గమనార్హం.తాను జైలుకు వెళ్లడానికి సిద్దమని... భవిష్యత్తులో కేసీఆర్ ఇంతకింత అనుభవించేలా చేస్తానని గతంలో మల్లన్న సవాల్ విసిరారు.

బీసీ కమిషన్ రియాక్షన్...
తీన్మార్ మల్లన్నపై కేసుల విషయంలో ఇటీవల జాతీయ బీసీ కమిషన్ స్పందించింది. పోలీసులు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఈ నెల 10న తీన్మార్ మల్లన్న జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. క్యూ న్యూస్ కార్యాలయానికి సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, ముఖ్యమైన ఫైళ్లను తీసుకెళ్లారని అందులో పేర్కొన్నారు. వరుస కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఈ నెల 29న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ డీజీపీ, సీపీలకు బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

తీన్మార్ మల్లన్న వెనుక ఎవరున్నారు?
తీన్మార్ మల్లన్న వెనుక బీజేపీ ఉందనే ఆరోపణలు ఆయన ప్రత్యర్థుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. మల్లన్నను బీజేపీనే పెంచి పోషిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. మల్లన్నపై కేసుల విషయంలో బీజేపీ జోక్యం చేసుకుంటోందని అంటున్నారు. ఇటీవల క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాల సందర్భంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్,ఆ పార్టీ శ్రేణులు అక్కడికి భారీగా తరలి వెళ్లారు. ఆ మరుసటి రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మల్లన్న కార్యాలయంపై దాడులను తీవ్రంగా ఖండించారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా చానెల్‌లో ఆయన అరెస్టుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేశారని కూడా ప్రత్యర్థులు చెబుతున్నారు. టీఆర్ఎస్,కాంగ్రెస్ ఇతర పార్టీలపై ఘాటైన విమర్శలు చేసే మల్లన్న బీజేపీని మాత్రం టచ్ చేయరనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన వెనుక బీజేపీ ఉందని ప్రత్యర్థులు పదే పదే ఆరోపిస్తున్నారు.

క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాలు
ఇటీవల హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతంలోని తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత ఫోటోలను క్యూ న్యూస్‌లో ప్రసారం చేయడమే కాకుండా మరొకరితో తనకు సంబంధం అంటగట్టారని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లన్నను ప్రశ్నించేందుకు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో క్యూ న్యూస్ ఉద్యోగులతో పాటు మరికొందరు బాధితుల వివరాలు ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.క్యూ న్యూస్ కార్యాలయానికి పోలీసులు వెళ్లిన సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మల్లన్న కార్యాలయంపై పోలీసులు దాడులు చేస్తున్నారనే విషయం తెలిసి మల్లన్న మద్దతుదారులు,బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి తరలివచ్చారు. పోలీసులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టాల్సి వచ్చింది.
Recommended Video

మల్లన్నపై చిలకా ప్రవీణ్ ఆరోపణలు
అంతకుముందు,చిలుకా ప్రవీణ్ అనే జర్నలిస్ట్ మల్లన్నపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మల్లన్నకు చెందిన క్యూ న్యూస్‌లోనే ప్రవీణ్ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. క్యూ న్యూస్‌ను అడ్డుపెట్టుకుని మల్లన్న ఇప్పటివరకూ రూ.200 కోట్లు వరకు వసూలు చేశాడని ఆరోపించారు. టీఆర్ఎస్,కాంగ్రెస్,ఎంపీలు బండి సంజయ్,ధర్మపురి అరవింద్‌ల నుంచి డబ్బులు తీసుకొచ్చుకున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే సీతక్కను కూడా మల్లన్న డబ్బులు డిమాండ్ చేశాడని... అయితే మల్లన్న సంగతి తెలిసి ఆమె డబ్బులు ఇవ్వలేదని అన్నారు. భవిష్యత్‌లో మల్లన్న ఆగడాలన్నీ బయటపెడుతామని హెచ్చరించారు.బహుజనవాదం పేరుతో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలను మోసం చేస్తున్నాడని చిలకా ప్రవీణ్ ఆరోపించారు.తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన ప్రవీణ్... మల్లన్న బహుజన బిడ్డలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కమిటీ అధ్యక్షులుగా నియమించినవారికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారో లేదో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications