కొత్త పార్టీ పెట్టమన్నారు: కృష్ణయ్య, పవన్ కళ్యాణ్‌కు కొత్త లింక్?
హైదరాబాద్: తాను కొత్త పార్టీ పెట్టే అంశం పైన జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కూడా చర్చిస్తానని ఎల్పీ నగర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆయన శనివారం సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి టక్కర్‌ను కలిశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కార్యదర్శిని కోరినట్లు చెప్పారు. బీసీల కోసం పార్టీ పెట్టాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని చెప్పారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్తపార్టీ పెట్టే అంశంపై పవన్ కళ్యాణ్‌తో కూడా చర్చిస్తానన్నారు.
తెలుగు రాష్గ్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోనుందని, ఆర్ కృష్ణయ్య నేత్రుత్వంలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆర్ కృష్ణయ్య పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పలుమార్లు మాట్లాడారు.

నాలుగు రోజుల క్రితం కూడా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పార్టీలన్ని అగ్ర కులాల నీడల్లోనే నడుస్తున్నాయని, బీసీలకు రాజ్యాధికారం కావాలంటే సొంతంగా పార్టీ ఏర్పాటు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం బీసీ పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పిన ఆయన పార్టీతో కలిసి వచ్చే ఎవరినైనా సరే కలుపుకుపోతామని చెప్పారు.
బీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే సొంత రాజకీయ పార్టీతోనే సాధ్యమని భావిస్తున్నారు కృష్ణయ్య. ఇదే క్రమంలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి బీసీలందరిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే యోచనలో ఉన్నారు. ఈ విషయంపై కళ్యాణ్ తో కూడా చర్చిస్తానని నాడు కూడా చెప్పారు.
పవన్ కళ్యాణ్ ముందుకు వస్తారా?
పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలకు దూరంగా ఉంటారు. అయితే అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి కేవలం బీసీల కోసం పార్టీ అంటే ఎంత మేరకు ముందుకు వస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
కాగా, ఆర్ కృష్ణయ్య తాను పార్టీ పెట్టేందుకు పదేపదే పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతానని చెప్పడంపై చర్చ సాగుతోంది. బీసీల కోసం పార్టీ పెడతామని చెబుతున్న కృష్ణయ్య.. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కోసం చూడటం ఏమిటని, కులాలకు దూరంగా ఉంటే పవన్ తనకు మద్దతు ఇస్తాడని కృష్ణయ్య ఎలా భావిస్తున్నాడని, ఆయన పవన్ కళ్యాణ్‌కు కొత్త ఫిట్టింగ్ పెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications