సికింద్రాబాద్ నుంచి అయోధ్య, హరిద్వార్ కు కొత్త రైళ్లు ఖరారు- రూట్, ముహూర్తం..!!
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి అయోధ్య, ఢిల్లీ, హరిద్వార్ కు వెళ్లే వారి సంఖ్య బాగా పెరిగింది. అయోధ్య, వారణాసికి వెళ్తున్న వారి రద్దీని గుర్తించిన రైల్వే శాఖ వీరి కోసం కొత్తగా రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే బోర్డు తాజాగా కసరత్తు చేసింది. దక్షిణ మధ్య రైల్వే నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు కొత్త రైళ్ల ప్రకటనకు సిద్దం అయింది. దీనికి సంబంధించి షెడ్యూల్ పై తుది కసరత్తు కొనసాగుతోంది.
రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల ప్రయాణీకుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నగరాలు, ఆధ్మాత్మిక కేంద్రాలకు కొత్త రైళ్లను ప్రకటించేందుకు రంగం సిద్దమైంది. తెలంగాణ నుంచి పలు ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్న వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలను చేసింది. అయోధ్యకు వెళ్లే వారి సంఖ్య కొంత కాలంగా పెరుగుతోంది. అయితే, హైదరాబాద్ నుంచి నేరుగా రైళ్ల సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో, కొందరు విమానాల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. మరి కొందరు రైళ్లు మారి గమ్యస్థానాలను చేరుకోవాల్సి వస్తోంది. దీంతో.. అయోధ్య ట్రైన్ ఆన్ డిమాండ్ ప్రతిపాదన రైల్వే బోర్డు పరిశీలనలో ఉంది. చర్లపల్లి నుంచి నిజామాబాద్ మార్గంలో ఈ ప్రతిపాదన ఆమోదానికి సిద్దమైంది.

రైల్వే శాఖ తాజా ప్రతిపాదనలు
అదే విధంగా సికింద్రాబాద్/ హజ్రత్ నిమాముద్దీన్ మధ్య కొత్త వీక్లీ రైళ్లను ప్రతిపాదించారు. కాగా.. సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి మీదుగా హరిద్వార్ కు వారానికి రెండు సార్లు నడిచేలా తెలంగాణ సంపర్క్ క్రాంతి పేరుతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ప్రవేశ పెట్టే ప్రతిపాదనకు దాదాపు ఆమోదం ఖాయమైంది. చర్లపల్లి / హరిద్వార్ మధ్య నిజామాబాద్ , అకోలా మీదుగా వారపు ట్రైన్ ఆన్ డిమాండ్ సర్వీసు నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రాష్ట్రం లోని పలు ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే వారి సంఖ్య పెరిగింది. దీంతో.. తిరుపతికి సర్వీసుల పెంపు.. పొడిగింపు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తిరుపతి - కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు వారానికి రెండు రోజులు నడుస్తోంది. ఈ రైలును నిజామాబాద్ వరకు పొడిగిస్తూనే రెగ్యులర్ రైలుగా మార్పు చేసేందుకు పరిశీలన జరుగుతోంది. తిరుపతి - నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ ప్రెస్ ను బోధన్ వరకు పొడిగించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications