వానొస్తే.. వెహి'కిల్స్': మొన్నటి వర్షానికి వేలాది కార్లు డ్యామేజ్ (ఫోటోలు)
హైదరాబాద్ : వర్షం కాస్తంత గట్టిగా కురిస్తే చాలు.. హైదరాబాద్ నగరమంతా అతలాకుతలమే. పొంగిపొర్లే నాలాలు,డ్రైనేజీలు.. వరద నీరు పోయే దారి లేక కాలనీలన్ని జలమయ్యే దృశ్యాలు. వానొచ్చినప్పుడల్లా.. ఏళ్లుగా నగరంలో కనిపిస్తున్న పరిస్థితి ఇది.
ఇక వాహనాదారుల తిప్పల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే అతుకుల గతుకుల రోడ్లు. ఆపై.. వరద నీరు ముంచెత్తితే.. ఏ మ్యాన్ హోల్ ఎక్కడుందో కూడా కనిపించని పరిస్థితి. వీటన్నింటికి మించి వానొచ్చినప్పుడల్లా.. వెహికల్స్ డ్యామేజీ అవుతుండడం వాహనాదారులకు పెద్ద తలనొప్పి. అందుకే.. వానొచ్చిందంటే.. వెహికల్స్ కాస్త వెహి'కిల్స్' అయిపోతున్నాయి.

మొన్నటి బుధవారం కురిసిన వర్షానికి నగరంలో చాలామంది వాహనాదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎంతలా అంటే.. ఇంటిముందు, ఆఫీసుల ముందు పార్క్ చేసిన కార్లన్ని రోడ్ల మీద నీళ్లలో కొట్టుకుపోయే పరిస్థితి. అపార్ట్ మెంట్స్ సెల్లార్లలో భారీగా వరద నీరు చేరడంతో.. చాలామంది కార్లు దెబ్బతిన్నాయి.

బుధవారం నాటి వర్షానికి ఏకంగా 2,000 ఫోన్ కాల్స్ హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు పోటెత్తాయి. అందరి బాధ ఒకటే.. వరద నీటికి మా వాహనాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని. ఇక సైబరాబాద్ పరిధిలోను మరో 2000 ఫోన్ కాల్స్ కంట్రోల్ రామ్ కు పోటెత్తడం గమనార్హం.

నగరంలోని కొన్ని ప్రైవేటు సర్వీసు సెంటర్ల నిర్వాహకులు చెబుతున్న దాని ప్రకారం.. మరుసటి రోజు వెయ్యి నుంచి 1500 వాహనాలు ప్రైవేటు సర్వీస్ సెంటర్లకు క్యూ కట్టాయి. ఆయా సర్వీస్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్న మాటేంటంటే.. గురువారం నాడు దాదాపుగా నగరంలోని ప్రతీ సర్వీస్ సెంటర్ కు 100 ఫోన్ కాల్స్ వచ్చినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి బుధవారం నాటి వర్ష భీభత్సం నగరంలోని కార్ల యజమానులకు పెద్ద డ్యామేజీనే మిగిల్చింది.












Click it and Unblock the Notifications