Rain in Hyderabad: హైదరాబాద్‍లో భారీ వర్షం.. జిల్లాల్లో వడగళ్ల వానలు..
హైదరాబాద్‍లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొచ్చి వాన పడింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, మాదాపూర్,నాగోల్, జూబ్లీహిల్స్ తో పాటు అనే ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కురవడంతో వాతావరణం చల్లగా మారింది. వికారాబాద్ జిల్లాలో వడగళ్ల వర్షం పడింది. వడగళ్లతో వరి పంట దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు.
గురువారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతవరణ శాఖ తెలిపింది.

శుక్ర, శని, ఆదివారాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో వడగళ్లు పడే అవకాశం ఉంది.
వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన..!!#Vikarabad #Rain #TelanganaRains #HyderabadRains #Rains #Oneindiatelugu pic.twitter.com/39QXII1cZy
— oneindiatelugu (@oneindiatelugu) March 16, 2023
అటు ఏపీలో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, పొట్టిశ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 18న భారీ వర్షాలు పడే అవకాశం పేర్కొంది.
పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు ఒకటి, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు మరో ద్రోణి ఏర్పడడం, ఈ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి ఏపీ వైపు తేమ గాలులు వీస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.












Click it and Unblock the Notifications