కాంగ్రెస్‌కు షాక్: టిఆర్ఎస్‌లో చేరిన ప్రతాప్, ఆహ్వానించిన హరీశ్, కెటిఆర్
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఇతర పార్టీల నేతల చేరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ నేత రాజారపు ప్రతాప్ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం వరంగల్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కెటి రామారావు, హరీశ్ రావుల సమక్షంలో రాజారపు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రులు. ఆయన అనుచరులు పలువురు కూడా టిఆర్ఎస్‌లో చేరారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని రాజారపు నమ్మారని, అందుకే ఆయన టిఆర్ఎస్‌లో చేరారని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా చెప్పారు.

అనంతరం రాజారపు ప్రతాప్ మాట్లాడుతూ.. వరంగల్ లోకసభ టిఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపు కోసమే తాను టిఆర్‌ఎస్‌లో చేరుతున్నానని ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఒక సామాన్య కార్యకర్తకు టికెట్ ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారని కొనియాడారు.
తాను కాంగ్రెస్‌లో స్థానికునికి టికెట్ ఇవ్వాలని వాదించినా తన మాట పట్టించుకోలేదన్నారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే కార్యకర్తలు నొచ్చుకుంటారని తెలిపినా వినకుండా తనను నానా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు జిల్లాకు సంబంధంలేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటనీ ప్రశ్నించారు. స్థానికుల కోసం మాట్లాడిన వారు కాదు, ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించిన వారు కాదు, అలాంటి వారికి టికెటు ఇవ్వడం ఏంటని నిలదీశారు.
తాను ఏదో ఆశించి పనులు చేసే వ్యక్తిని కానని అన్నారు. కాగా, వరంగల్ లోకసభ ఎన్నికల్లో నేపథ్యంలో ప్రతాప్ టిఆర్ఎస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications