OTTల్లో 'స్వేచ్ఛ'గా అశ్లీలత!
సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూ అవకాశాలను అంది పుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ దుర్వినియోగమవుతోంది. ఓవర్ ది టాప్ (ఓటీటీ) ఛానల్స్ నిరభ్యంతరంగా అశ్లీలతను వ్యాపింప చేస్తున్నాయి. వీటిని చూసేవారిలో యువత ఎక్కువగా ఉండటంతో ఛానల్సన్నీ వారికి ''అవసరమైన మోతాదులోనే'' కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. అందుకు 'రానా నాయుడే' ఉదాహరణ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 30 సంవత్సరాల నుంచి కుటుంబ కథాచిత్రాల కథానాయకుడిగా పేరున్న వెంకటేష్ మొదటిసారిగా నటించిన వెబ్ సిరీస్ మొత్తం అడల్ట్ కంటెంట్ తో నిండిపోయింది. వెంకటేష్ కు, విభిన్న క్యారెక్టర్లను పోషించడంద్వారా రానాకున్న ఇమేజ్ ఇద్దరిదీ కలిపి ఒకేసారి పోయింది.
ఓటీటీలు యథేచ్ఛగా శృంగారాన్ని వెదజల్లుతున్నాయి. వీటిల్లో స్ట్రీమ్ అయ్యే వెబ్ సిరీస్‌లకు సెన్సార్ తప్పనిసరిగా ఉండాలంటూ అన్నివర్గాల నుంచి డిమాండ్ వస్తోంది. భాష అర్థమైనా కాకున్నా అందుబాటులో ఉన్న సబ్‌టైటిల్స్‌తో యువత కథను అర్థం చేసుకుంటోంది. ఒకరకంగా శృంగార చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు.. "వెబ్ సిరీస్‌కు ఎక్కువ.. సాఫ్ట్ పోర్న్ సిరీస్‌లకు తక్కువ" అన్నట్లుగా మారిపోయాయి. సామాజికంగా అనేక మార్పులకు కారణమవడంతోపాటు చిన్నపిల్లలు కూడా పక్కదారి పట్టే అవకాశాలున్నాయనే ఆందోళన అన్నివర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

కొన్ని వెబ్ సిరీస్ లు వెగటు పుట్టించే డైలాగులతోపాటు ఏకంగా బూతుకథలనే ప్రసారం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ తరహా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే కేంద్రం అశ్లీలతను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. యూట్యూబ్ ఛానల్స్, ఓటీటీ కంటెంట్‌లను సమాచార శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. అలాగే ఆన్ లైన్ ఛానెల్స్ పై నిఘా ఉంచుతోంది. కొత్తగా ఎవరైనా ఛానల్ ప్రారంభించాలంటే కేంద్ర సమాచార, ప్రసారశాఖ అనుమతి తప్పనిసరి చేసింది. కరోనా లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలంతా వినోదం కోసం ఓటీటీలు చూడటానికి అలవాటు పడ్డారు. ప్రసారమవుతున్న కార్యక్రమాలద్వారా ఓటీటీలు తమకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాయనే అభిప్రాయం అందరినుంచి వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications