చాక్లెట్ ఆశ చూపి బాలికపై రేప్ యత్నం
ఖమ్మం: జిల్లాలోని కొత్తగూడెంలో చాక్లెట్ ఆశ చూపి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు ఓ దుర్మార్గుడు. బాలిక కేకలు వేసి అతని బారి నుంచి తప్పించుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. స్థానిక మధురబస్తీకి చెందిన హబీబ్ అనే డ్రైవర్ తన ఇంటి సమీపంలోని 9 ఏళ్ల మైనర్ బాలికకు చాక్లెట్లు ఇప్పిస్తానని మాయామాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్ళాడు.
ఆ తర్వాత బాలికపై లైంగికదాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో భయపడి తలుపులు తెరిచాడు. దీంతో చిన్నారి ఇంటికి పరుగు తీసింది. సంఘటన జరిగిన రోజు బాలిక తండ్రి ఊర్లో లేకపోవడంతో, మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చిన తండ్రికి విషయం తెలిపింది.
దీంతో చిన్నారి తండ్రి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు హబీబ్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడి, జైలుకి వెళ్లిన ఓ ప్రభుద్ధుడి సంఘటన మరువక ముందే కొత్తగూడెంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాల్వంచ జెన్‌కో కాలనీలో భారీ చోరీ
ఖమ్మం జిల్లాలోని పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ ఇంజనీర్లకు చెందిన జెన్‌కో కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఇంజనీర్లకు చెందిన 8 ఇళ్ల తాళాలను పగులగొట్టి రూ.15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి దొంగలు దోచుకుపోయారు. జెన్‌కో కాలనీలో నివసించే ఇంజనీర్లు శని, ఆదివారం సెలవుదినాలు రావడంతో చాలామంది పెళ్ళిలకు, శుభ కార్యక్రమాలకు ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళిపోయారు.
ఈ సమాచారం తెలుసుకున్న దొంగలు 8ఇళ్ల తాళాలు పగులగొట్టి, 5ఇళ్లల్లో ఉన్న బంగారం, వెండి వస్తువులను దోచుకుపోయారు. చంద్రశేఖర్ ఇంట్లో 19తులాల బంగారం, ప్రసాద్ ఇంట్లో 16తులాల బంగారం, చక్రపాణి ఇంట్లో 4తులాల బంగారం, కె. మధుబాబు ఇంట్లో అరకేజీ వెండి దొంగలు బీరువాలను పగులగొట్టి దోచుకుపోయారు.
శ్రీనివాసరావు అనే ఎడీఇ ఇంట్లో దొంగలు ప్రవేశించి ఒక బెడ్‌రూంలో ఉన్న బీరువాను పగులగొట్టి రూ.45వేల నగదు, 4 తులాల బంగారం, కేజీ వెండి దోచుకుపోయారు. శ్రీధర్, నర్సింహరెడ్డి, శ్రీనివాస్ ఇళ్ల తాళాలు పగులగొట్టి బీరువాలో ఏమీ లేకపోవడంతో వస్తువులను చిందర వందరగా పడవేసి వెళ్ళిపోయారు. సోమవారం బాధితులు తమ ఇళ్లల్లో చోరీ జరిగిందన్న విషయం తెలుసుకుని లబోదిబోమన్నారు. పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications