ఏడాది క్రింద రేప్ చేశాడు: యువతిని చంపి గుంతలో పాతిపెట్టాడు
కరీంనగర్: అత్యాచార ఘటనతోనే ఆమెపై పగ పెంచుకున్నాడు.. హత్య చేయాలని పథకం పన్నాడు.. ఎవరికి అనుమానం రాకుండా హత్యచేసి పైపులైన్ శవాన్ని గుంతలో పాతిపెట్టాడు..చివరకు పోలీసులకు చిక్కిన కామాంధుడు కటకటాల పాలయ్యాడు.. కాటారంలో మూడు రోజుల క్రితం సంచలనం సృష్టించిన యువతి హత్య కేసులో నిందితుడు గాలి సారయ్యను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
కాటారం సీఐ శంకర్‌రెడ్డి కథనం ప్రకారం.. కాటారం గ్రామానికి చెందిన చెందిన గంట సుగుణ కుమారి (24)పై గతేడాది సారయ్య అత్యాచారానికి పాల్పడగా..యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యువతి ఫిర్యాదు మేరకు సారయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని జైలుకు పంపారు. అప్పటి నుంచి ఆమెపై సారయ్య పగ పెంచుకున్నాడు. కొద్ది రోజుల తరువాత బెయిలుపై బయటికి వచ్చిన సారయ్య సుగుణ కుమారిని హత్య చేసేందుకు వేచి చూస్తున్నాడు.

బెదిరిస్తూ వచ్చాడు.
మరి కొద్ది మాసాలుగా వేచి చూసిన సారయ్య ఇటీవలనే సుగుణ కుమారితో తనపై పెట్టిన కేసును కొట్టి వేయించాలని, లేదా తనతో సహజీవనం చేయాలని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో చేసేదేమిలేక సదరు యువతి పది రోజులుగా సారయ్యతో కలిసి ఉంటుంది. ఏడాది కాలంగా యువతిని హత్య చేసేందుకు వేచి చూస్తున్న సారయ్య సద్దుల బతుకమ్మ పర్వదినం నాడు తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని గ్రామంలో తిరిగాడు.

బతుకమ్మ సంబరాల్లో మునిగి...
గ్రామంలోని మహిళలంతా బతుకమ్మ ఆటలో మునిగి తేలుతుండగా.. సుగుణ కుమారిని తీసుకొని వెళ్లిన సారయ్య కాటారం-ఆదివారంపేట మార్గ మధ్యలోని మల్బరీ తోటలోకి వెళ్లారు. తనపై పెట్టిన కేసు ఉపసంహరణ కోసం యువతిని బలవంతం చేయడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన సారయ్య సుగుణ కుమారిపై అత్యాచారం జరిపి చితకబాదడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

అనుమానం రాకుండా...
ఎవరికీ అనుమానం రాకుండా తన సొంత చేనులోనే ఉన్న పైపులైన్ గుంతలో యువతి మృతదేహాన్ని పూడ్చి వేసేందుకు ప్రయత్నించగా.. తన ట్రాక్టర్ బురదలో దిగబడింది. బురదలో దిగబడిన ట్రాక్టర్‌ను లాగేందుకు మరో ట్రాక్టర్ కోసం గ్రామంలోని ఓ వ్యక్తికి చరవాణిలో ప్రాధేయపడగా అందుకు యజమాని అంగీకరించాడు.

ఇలా బయటపడింది...
మృతదేహాన్ని పూడ్చి వేసేందుకు ఇతరుల ట్రాక్టర్ తీసుకువెళ్లడంతో అసలు విషయం బయట పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సారయ్య కోసం మూడు రోజులుగా గాలించగా సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గతంలో సారయ్యపై పలు కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. సారయ్య నేరచరిత్రపై క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు 376, 302, 201 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట కాటారం ఎస్సై కిరణ్ కుమార్ ఉన్నారు.












Click it and Unblock the Notifications