తెలంగాణ హైవేల వెంట ఈ 12 దాబాల్లో తనిఖీలు.. షాకైన అధికారులు
దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చేవాళ్లు హైవేల పక్కనే ఉన్న దాబాల్లో తినడం అలవాటే. దాబాల్లో వేడివేడిగా అప్పటికప్పుడు రెడీ చేసి పెడుతుంటారు. హైదరాబాద్ కు వచ్చే దారుల్లో హైవేల వెంట ఇప్పుడు అనేక దాబాలు వెలిశాయి. ఆకలితో ఉన్న ప్రజలు దాబాలో రుచి, శుచి గురించి పట్టించుకోరు. ఏదో ఒకటి అని తినేస్తుంటారు. అయితే తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ కు వచ్చే నేషనల్ హైవేలపై ఉన్న దాబాల్లో 12 దాబాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడి కిచెన్, ఆహార పదార్థాలను చూసి షాక్ అయ్యారు. కిచెన్ లో క్రిమికీటకాలు, ఎలుకల మలం.. కవర్ చేయని ఆహారం, వెజ్, నాన్ వెజ్ ఆహారాన్ని ఒకే చోట నిల్వ చేయడం.. తదితర వాటిని గుర్తించారు.
ఎన్ హెచ్-65(హైదరాబాద్- విజయవాడ), ఎన్ హెచ్- 163(వరంగల్- హైదరాబాద్), ఎన్ హెచ్-44(కర్నూల్- హైదరాబాద్) లోని 12 అవుట్ లెట్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఈ అవుట్ లెట్స్ లో తేదీ ముగిసిన సరుకులు, ఆహార పదార్థాలు, కుళ్లిన ఆహారం, మాంసం, కెమికల్ కలర్స్, పరిశుభ్రంగా లేని కిచెన్.. గుర్తించారు. సంగారెడ్డిలోని రుద్రారంలో ది ప్యాలెస్ హోటల్ లో తనిఖీ నిర్వహించిన అధికారులు.. కిచెన్ లో క్రిమి కీటకాలు, ఎలుకల మలం, కవర్ చేయని ఆహారం, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ను ఒకేచోట పెట్టడం, సింథటిక్ కలర్స్ ను వాడటం.. తదితర విషయాలను గుర్తించారు.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చట్టం-2006 ప్రకారం.. 107 కిలోల పాడైన ఆహారాన్ని సీజ్ చేశారు. ప్రాన్స్, చికెన్, మటన్, పనీర్, గోబి ఫ్రై ఇలా అనేక పాడైపోయిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. ఈ అవుట్ లెట్ ను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ మూసి వేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఎన్ హెచ్- 65 రహదారిపై.. చౌటుప్పల్ మండలం కోయలగూడెం వద్ద అతిథి రెస్టారెంట్ లో ఆహారాన్ని సీజ్ చేశారు. చిట్యాల మండలం పెద కాపర్తి గ్రామం వద్ద ఉత్సవ్ రెస్టారెంట్ లోని ఆహారం కూడా కుళ్లిన స్టేజ్ లో ఉన్నట్లు గుర్తించారు. అలాగే చౌటుప్పల్ మండలం కోయలగూడెం వద్ద సంగం హోటల్ లోనూ నాణ్యమైన ఆహారం లేనట్లు అధికారులు గుర్తించారు. ఎన్ హెచ్- 44 రహదారిపై గద్వాల్ లోని తాజ్ ప్యాలెస్ రెస్టారెంట్, గద్వాల్ లో అతిథి రెస్టారెంట్ లో తనిఖీలు చేశారు. ఆహారాన్ని ల్యాబ్ కు పంపించారు. అలాగే ఎన్ హెచ్-163 రహదారిలో హోటల్ వివేరా లోనూ తనిఖీలు నిర్వహించారు. అక్కడ కూల్ డ్రింక్స్ , 2 కేజీల గ్రేవీ ఎక్స్ పైరీ తేదీ దాటినా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications