హైదరాబాద్ లో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- చర్లపల్లిని మించి
Hitech Railway Station: ఐటీ హబ్ హైటెక్ సిటీకి కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఇక్కడి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం, ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపుగా 81 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాదిలో ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. ఈ పనులు పూర్తయితే చర్లపల్లి తరహాలో ఇప్పుడున్న వాటి కంటే అదనపు రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అమృత్ భారత్ కింద తెలంగాణలో పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ సహా మలక్‌పేట్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, ముద్ఖేడ్, ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్.. వంటి స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. మహబూబాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, జహీరాబాద్, తాండూరు, భద్రాచలం రోడ్, హుప్పుగూడ, యాదాద్రి, ఖాజీపేట్ జంక్షన్, మధిర వంటి రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ.

ఇప్పటికే సికింద్రాబాద్, యాదాద్రి వంటి రైల్వే స్టేషన్ల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి కూడా. 718 కోట్ల రూపాయల వ్యయంతో సికింద్రాబాద్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మూడు దశల్లో ఇవి పూర్తి కానున్నాయి. వచ్చేే 40 సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మితం కానుంది. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్.. నిర్మాణ పనులను పరిశీలించారు.
అదే క్రమంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులూ చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటివరకు 812 శాతం పనులు పూర్తయ్యాయి. స్టేషన్ ఎంట్రీ ర్యాంప్, దివ్యాంగుల సౌకర్యాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి లాంచ్, ప్లాట్ ఫామ్ షెడ్స్ పూర్తయ్యాయి. స్టేషన్ భవన సముదాయం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, సర్కులేటింగ్ ఏరియా నిర్మాణం సాగుతోంది. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మితమౌతోంది. లిఫ్ట్, ఎస్కలేటర్ సైతం అందుబాటులోకి రానుందీ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో.
కాచిగూడ, సికింద్రాబాద్ తరహాలో ఎస్కలేటర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకోనుంది. ప్లాట్‌ఫామ్ రీసర్ఫేసింగ్ పనులు కొనసాగుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేశారు. ఈ స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధాన టెర్మినల్ గా మారే అవకాశాలు లేకపోలేదు. రద్దీ సమయాల్లో కొన్ని రైళ్లను ఇక్కడి నుంచి నడిపించవచ్చు.












Click it and Unblock the Notifications