వర్క్ షాప్ రసాభసా: రేణుకాచౌదరి చీటర్, 420
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు మళ్లీ వార్తలకెక్కాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో నేతలు డబ్బులు తీసుకుని టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా వైరా అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తానని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తమ వద్ద రూ. 1.10 కోట్లు తీసుకున్నారని డాక్టర్ రాంజీ సతీమణి చంద్రకళ అనే గిరిజన మహిళ ఏకంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ధర్నాకు దిగటం చర్చనీయాంశమైంది.
మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ దళిత విభాగం ఆధ్వర్యంలో వర్క్ షాపు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, పీసీసీ కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రమాదేవి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్ కుమార్, మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఇతర ముఖ్యనేతుల హాజరయ్యారు.
సమావేశం ప్రారంభానికి ముందు ముఖ్య నేతలంతా వేదికపై ఆశీనులయ్యారు. ఆ సమయంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైరా అసెంబ్లీ టికెట్ ఆశించి, భంగపడి, కొద్దినెలల క్రితం గుండెపోటుతో మరణించిన డాక్టర్ రాంజీ భార్య చంద్రకళ, పలువురు గిరిజన సంఘాల నాయకలు, కార్యకర్తలు ఫ్లెక్లీలు చేత పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వేదికవైపు దూసుకొచ్చారు.
ఖమ్మం రెవిన్యూ డివిజన్ కార్యాలయం నుంచి కాంగ్రెస్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వచ్చి నేతల ఎదుటే రేణుకాచౌదరి చీటర్, 420 అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వేదిక మీదున్న నేతలు వారించబోగా కాంగ్రెస్ పార్టీకి గిరిజనులు అక్కర్లేదా అంటూ ప్రశ్నించారు.

జిల్లా ఆబిడ్డనని చెప్పుకుని తిరుగుతూ, జిల్లా ప్రజలనే మోసం చేసిన రేణుకాచౌదరిని ఖమ్మంలో అడుగు పెట్టనీయబోమన్నారు. సమావేశానికి ముందే తీవ్ర గందరగోళం నెలకొనడంతో.. ఏం చేయాలో పాలుపోక.. వర్క్‌షాపుకు విచ్చేసిన నేతలంతా కిమ్మనకుండా కూర్చున్నారు. రేణుకాచౌదరి నుంచి ఆ డబ్బును ఇప్పించాలని ఆమె కాంగ్రెస్ నాయకత్వాన్ని వేడుకుంది.
దీంతో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని జిల్లా నాయకత్వం, వర్క్‌షాపుకు వచ్చిన కాంగ్రెస్ ఎస్టీసెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు హామీ ఇవ్వటంతో, ఆయనకు వినతిపత్రం అందించి ఆందోళన విరమించారు. కాగా వర్క్‌షాపులో మాట్లాడిన మల్లుభట్టి విక్రమార్క ఎవరో కొందరు కావాలని గొడవ చేయాలని భావిస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
మీడియాతో మాట్లాడిన ఆమె డాక్టర్ వృత్తిలో రాణిస్తున్న తన భర్త ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో కాంగ్రెస్ పార్టీ తరుపున వైరా అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని భావించారని, ఈక్రమంలో టిక్కెట్ ఇప్పిస్తానని నమ్మబలికిన రేణుక.. ఏఐసీసీ అధ్యక్షురాలు అల్లుడు రాబర్ట్ వాద్రాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి రూ. 1.10 కోట్లు స్వయంగా పుచ్చుకున్నారని ఆరోపించింది.
వైరా సీటు రాక, అవమానం భరించలేక మనోవేదనకు గురైన తన భర్త గుండెపోటుతో మరణించారని కన్నీరు పెట్టుకుంది. ఆయన మరణానంతరం తమ కుటుంబం రోడ్డున పడిందని, తన భర్త చావుకు కాంగ్రెస్ పార్టీతోపాటు, ఎంపీ రేణుక కారణమని ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications