SLBC టన్నెల్లో ఇంకా కొనసాగుతున్న ఆపరేషన్.. రోబోలు మా వల్ల కాదన్నాయా?
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పైకప్పు కుప్పకూలిన ఘటన తాలుకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. slbc సొరంగ మార్గంలో పొక్లెయిన్స్ తో ఆయా విభాగాల సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 22వ తేదీన జరిగిన ఈ ఘటన ఎనిమిది కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. టన్నెల్ లో చిక్కుకుపోయిన వారు అందులోనే సమాధి అయిపోయిన ఘటన వారి కుటుంబాలలో తీరని ఆవేదనకు కారణమైంది.
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఇప్పటివరకు ఒక ఇద్దరు మృతదేహాలు లభ్యం కాగా ఇంకా ఆరుగురి మృతదేహాల కోసం ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ త్వరగా కొనసాగించడం కోసం టన్నెల్ లో సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం రోబోలను రంగంలోకి దించింది. రోబోల అనుసంధానంతో మట్టిని తొలగించేందుకు టన్నెల్లోకి పంపించిన యంత్రం సరిగ్గా పనిచేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. మూడురోజుల పాటు ప్రయత్నం చేసినప్పటికీ సాంకేతిక కారణాలతో రోబోల పనితీరు నిలిచిపోయింది.

రోబోలతో నో యూజ్
మూడు రోజులపాటు ప్రయత్నాల తర్వాత రోబోలతో ఫలితం లేదని భావించిన అధికారులు యంత్రాన్ని బయటకు పంపించారు. ప్రస్తుతం మాన్యువల్ గా పొక్లెయిన్స్ తో సిబ్బంది సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. మట్టిలో చిక్కుకున్న ఆరుగురి అవశేషాలను గుర్తించడమే లక్ష్యంగా సహాయక చర్యలు జరుగుతున్నాయని వారు చెప్తున్నారు. ఇక మట్టిని రాళ్లను తొలగించేందుకు అధునాతన పద్ధతులతో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు.
అక్కడ నిషేధిత ప్రాంతం
టన్నెల్ లోపల 13.936 కి.మీ డీ1 వద్ద దాదాపు 20 మీటర్ల వరకు సిబ్బంది వెళ్లడానికి అవకాశం లేనటువంటి నిషేధిత ప్రాంతంగా గుర్తించారు. ఆ ప్రాంతంలో సిబ్బంది వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని దానిని నిషేధిత ప్రాంతంగా వెల్లడించారు. ప్రస్తుతం ఎన్డిఆర్ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్, హైడ్రా, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ తో పాటు మరో ఆరు విభాగాలు సహాయక చర్యలలో పాల్గొంటూనే ఉన్నాయి.
ఆపరేషన్ ఎప్పటికి పూర్తవుతుందో.. అధికారుల పరేషాన్
ఇంకా ఆరుగురి అవశేషాలు బయటకు తీయడానికి ఎంత కాలం పడుతుంది అన్నది మాత్రం అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇంకా మృతదేహాల అవశేషాలనైనా అధికారులు బయటకు తెస్తారా లేదా అని ఆరు కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications