పోలీసు కొలువు.. రెసిడెంట్ సర్టిఫికెట్‌పై పోలీసుల విచారణ,
ఏ కొలువుకు అయినా స్థానికత కంపల్సరీ.. ఒకటో తరగతి నుంచి వరసగా నాలుగేళ్లు చదివితే వారు ఆ జిల్లా పరిధిలోకి వస్తారు. ఇదీ ఎప్పటినుంచో ఉన్న అంశం... అయినా పోలీస్ కొలువుల భర్తీలో 95 శాతం స్థానికతను పకడ్బందీగా అమలు చేయాలని పోలీస్ నియామక మండలి ఈసారి గట్టి నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా స్థానికత నిర్ధారించనుంది. నకిలీ స్టడీ సర్టిఫికెట్లకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లపై పోలీసులు విచారణ చేస్తారని తెలుస్తోంది. పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారికి మొబైల్ నంబర్ తప్పనిసరి అని పోలీస్ నియామక మండలి స్పష్టంచేసింది.
అభ్యర్థుల మొబైల్ నంబరే యూజర్ ఐడీగా ఉంటుంది. నియామక పక్రియకు సంబంధించిన సమాచారం మొబైల్ నంబర్‌కు చేరవేస్తామని, ఆ నంబర్‌ను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు మార్చొద్దని సూచించింది. రాష్ట్రంలోని ఆరు పోలీసు విభాగాల్లో 17,291 పోస్టుల భర్తీకి సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 20 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అభ్యర్థులు తమ సంతకంతో కూడిన పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అప్‌లోడ్ చేయాలని, సంతకం లేని దరఖాస్తులను తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. దరఖాస్తు నమోదు, విద్యార్హత, తదితర వివరాలకు తమ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అభ్యర్థులకు సూచించింది. అభ్యర్థులు ఏ పోస్టుకు అర్హులు అవుతారో చూసుకుని దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దరఖాస్తు సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే 9393711110, 9391005006 హెల్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది.

అభ్యర్థులు మొదట పోలీస్ నియామక మండలి వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. టెన్త్ సర్టిఫికెట్‌లో ఉన్న విధంగా పేరు, పుట్టిన తేదీ, జెండర్, కమ్యూనిటీ వివరాలతోపాటు తమ మొబైల్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి. లాగిన్‌లోకి వెళ్లి యూజర్ ఐడీగా మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌గా పుట్టిన తేదీని నమోదు చేయాలి. లాగిన్ కాగానే.. పోలీస్ నియామక మండలి విడుదల చేసిన ఆరు నోటిఫికేషన్లు కనిపిస్తాయి. వివిధ విభాగాలకు చెందిన పోస్టులు కనిపిస్తాయి. అభ్యర్థులు దరఖాస్తు చేయాలనుకునే పోస్టును ఎంపిక చేసుకోవాలి. దానికి నిర్ణయించిన ప్రకారం ఫీజు చెల్లించాలి. ఆ నంబర్ సాయంతో పార్ట్-1కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష ఏ భాషలో రాస్తారో పేర్కొనాలి. 1 నుంచి 7వ తరగతి వరకు స్థానికత వివరాలను నమోదు చేయాలి. ప్రిలిమినరీ రాతపరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకంతో కూడిన ఫైల్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్‌మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగా దరఖాస్తు దాఖలు ప్రక్రియ పూర్తవుతుంది. చెల్లించిన ఫీజును రీఫండ్ చేయబోమని పోలీస్ నియామక మండలి పేర్కొంది.
అభ్యర్థి చదివిన పాఠశాల నుంచి స్డడీ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఎన్ని పాఠశాలల్లో చదివితే అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలి. ఒకవేళ ఏ పాఠశాలలో చదవకపోతే.. ఎన్నేళ్లు చదవలేదో అన్నేళ్లకు సంబంధించి స్థానిక తహసీల్దార్ నుంచి నివాస ధ్రువపత్రం తీసుకోవాలి. చదివిన తరగతులకు సంబంధించి స్టడీ సర్టిఫికెట్లను ఆయా పాఠశాలల నుంచి తీసుకొని సమర్పించాల్సి ఉంటుంది. ధ్రువపత్రాలను సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో చూపించాలి. ఆ రెండింటిని పరిశీలించిన తర్వాత అభ్యర్థి స్థానికతను నిర్ధారిస్తారు. పాఠశాలల్లో చదివి కూడా ఇతర ప్రాంతం నుంచి నివాస ధ్రువపత్రాన్ని సమర్పిస్తే స్థానికతను పరిగణించబోమని పోలీస్ నియామక మండలి స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications