హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ ప్రాజెక్ట్
హైదరాబాద్ పాతబస్తీలో దశాబ్దాల తరబడి ఆక్రమణలు, నిర్లక్ష్యానికి గురైన చారిత్రక బమ్-రుక్-ఉద్-దౌలా సరస్సు పునరుజ్జీవనం పొందుతోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (hydraa) ఈ నిజాం కాలపు చెరువుకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జనవరిలో ప్రజల సందర్శనార్థం దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
పనులు తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం సరస్సు అభివృద్ధి కార్యక్రమాలను క్షుణ్ణంగా సమీక్షించారు. స్థానిక నివాసితులకు సులభంగా ప్రవేశం కల్పించేలా సరస్సు అప్రోచ్ రోడ్లు, ప్రవేశ ద్వారాలను పరిశీలించారు. కట్ట వెంట ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్‌లు, లోపలి కంచె, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సరస్సును ఎంటర్టైన్మెంట్ సెంటర్ గా తీర్చిదిద్దడంలో భాగంగా పిల్లల ఆట స్థలాలు, వృద్ధుల కోసం ప్రత్యేక గెజిబోలు, ఉద్యానవనాలు, ఓపెన్ జిమ్‌లను అభివృద్ధి చేస్తున్నారు.

సరస్సు ప్రాంగణంలో నిరంతర నిఘా కోసం సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటుకానున్నాయి. ఈ సరస్సు పాతబస్తీకి ఓ సరికొత్త లుక్ ను తీసుకుని రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఔషధ గుణాలు, స్థానిక వృక్ష జాతులను విస్తృతంగా నాటుతున్నారు. పచ్చిక బయళ్లను రూపొందిస్తోన్నారు. ఇది లేక్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతను కూడా తగ్గించడంలో సహాయపడుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
సరస్సు చారిత్రకతను కాపాడేందుకు నిజాం కాలంలో ఉపయోగించిన రాళ్లకు సారూప్యంగా ఉండే వాటిని నిర్మాణాల కోసం ఉపయోగిస్తోన్నారు. అంతేకాకుండా, సరస్సులోకి నిరంతరాయంగా నీటి ప్రవాహం ఉండేలా విస్తృతమైన ఇన్‌లెట్స్, అవుట్‌లెట్స్ నిర్మాణాన్ని చేపట్టారు. పునరుద్ధరణ అనంతరం ఈ ప్రాంతంలో ఈ సరస్సు వరదలను నివారించడంలో కీలక పాత్ర పోషించనుందని అంచనా వేస్తున్నారు.
రాజేంద్రనగర్, ఆరాంఘర్, ఇతర సమీప ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీటిని నియంత్రించేందుకు, సుమారు 10 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం నుండి నీటిని సరస్సులోకి మళ్లించేలా ఇన్‌లెట్‌లను రూపొందిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో వరదలను అరికట్టడానికి ఈ సరస్సు ఒక సహజ బఫర్‌గా పనిచేసేలా ఈ చెరువును తీర్చిదిద్దుతున్నారు. ఈ సరస్సును 1770లో మూడవ నిజాం సికిందర్ ఝా పాలనలో అప్పటి నవాబ్ రుక్న్-ఉద్-దౌలా నిర్మించారు. ఆయన పేరు మీదుగానే దీనికి 'బమ్-రుక్న్-ఉద్-దౌలా' అని నామకరణం చేశారు.












Click it and Unblock the Notifications