టీపీసీసీ పదవి నుంచి దింపేందుకు కుట్ర - రేవంత్ కన్నీటి పర్యంతం..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ కన్నీటి పర్యంతమయ్యారు. తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కుట్ర జరుగుతోందంటూ ఆవేదనకు గురయ్యారు. తనను రాజకీయంగా దెబ్బ తీయటానికి కుట్ర జరుగుతోందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తనను ఒంటరి వాడిని చేసారంటూ వాపోయారు. కాంగ్రెస్ పార్టీని చంపేందుకు బీజేపీతో కలిసి సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఢిల్లీలో ఉండి ప్రధాని మోదీ..అమిత్ షా తో రహస్య మంతనాలు సాగించారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న కుట్రతోనే కేసీఆర్ అమిత్ షా ఆడుతున్న డ్రామాలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నిక అని రేవంత్ చెప్పుకొచ్చారు. మునుగోడులో కాంగ్రెస్ ను ఓడించి రేవంత్ ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించాలని కొందరు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసారు. రేవంత్ రెడ్డి పిసిసిగా ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకే సొంత పార్టీ నాయకులు కేసీఆర్ తో కలిసి కుట్ర చేస్తున్నారు తొందర్లోనే అన్ని నిజాలు తెలుస్తాయని కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు పిసిసి శాశ్వతం కాదని, సోనియాగాంధీ ఇచ్చిన అవకాశం మాత్రమేనని చెప్పారు.

పదవులు ఎవరికి శాశ్వతం కాదని రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభిమానులు ఆలోచించి..కదలాలంటూ రేవంత్ పిలుపునిచ్చారు. పార్టీ కోసం తాను ప్రాణాలు ఇచ్చేందుకు సిద్దమని..తుది శ్వాస వరకు పార్టీ కోసం పోరాడుతానని రేవంత్ ఎమోషనల్ అయ్యారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను తిప్పి కొడుతూ.. కార్యకర్తల కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్దమని రేవంత్ చెప్పారు. జాతీయ గుర్తింపు పొందిన పార్టీలు మాత్రమే బ్యాలెట్ పేపర్‌లో ముం దుండాలని, లిస్ట్‌లో టీఆర్‌ఎస్ రెండోస్థానంలో ఉండడం నిబంధనలకు విరుద్ధమన్నారు.
మునుగోడు సమస్యల పరిష్కారానికి ఈ నెల 26, 27వ తేదీల్లో చండూరులో దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను కోరనున్నట్లు వెల్లడించారు. స్వతంత్ర అభ్యర్థి గుర్తు విషయం కారణంగానే ఆర్వోను విధుల నుంచి తొలగించడం, ఆ వెంటనే డ్రామారావు కేటీఆర్ స్పందించడం పథకం ప్రకారమే జరిగిందన్నారు. ఇప్పుడు రేవంత్ సొంత పార్టీ నేతల పైన చేసిన వ్యాఖ్యలు..మునుగోడులో ఓటమితో తనను తొలిగించాలనే ప్రయత్నాలంటూ చేసిన వ్యాఖ్యలు మునుగోడు పొలిటికల్ హీట్ నడుమ కాంగ్రెస్ పార్టీలో మరింత సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications