తెలంగాణ టిడిపిలో విభేదాలు: రేవంత్ రెడ్డిని ఆశపెట్టిన బాబు?
హైదరాబాద్: నిజానికి చాలా కాలంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు రగులుతున్నాయి. ముఖ్యంగా, ఎర్రబెల్లి దయాకర్ రావుకు, రేవంత్ రెడ్డికి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ విభేదాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రమైన వ్యాఖ్యలతో దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డిని చంద్రబాబు ప్రోత్సహించారని అంటారు.
రేవంత్ రెడ్డికి చంద్రబాబు తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవిని అప్పగిస్తానని కూడా ఆశపెట్టారని అంటారు. అలా ఆశ పెట్టి తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అసంతృప్త శాసనసభ్యులను తమ వైపు లాక్కోవాలని పథక రచన చేశారని, ఈ విషయాలేవీ మిగతా తెలంగాణ నాయకులకు చంద్రబాబు చెప్పలేదని అంటారు.
టిడిపి అధ్యక్ష పదవిపై ఆశతో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి శాసనసభ్యులను కొనుగోలు చేసే వ్యవహారాన్ని చంద్రబాబు, టిడిపికి చెందిన కేంద్ర మంత్రి, ఇతరుల సహకారంతో అమలు నడిపించడానికి రంగంలోకి దిగారని అంటున్నారు. ఎర్రబెల్లిని బలహీనపరిచే వ్యూహం రేవంత్ రెడ్డికి ఉందని అంటారు. అందులో భాగంగానే ఆయన వరంగల్ జిల్లాకు చెందిన వేం నరేందర్ రెడ్డి పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ వంటి నాయకులు కొంత మంది అరికెల నర్సిరెడ్డి పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. అయితే, రేవంత్ రెడ్డి టిడిపి అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పి ఆయన ప్రతిపాదించిన వేం నరేందర్ రెడ్డికి చంద్రబాబు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఇతర పార్టీల శాసనసభ్యులను తమవైపు లాక్కుంటామనే విషయం బయటకు పొక్కకుండా చూసే బాధ్యతను మాత్రమే తమకు అప్పగించారని, ఆపరేషన్ జరిగే తీరును తమకు ఏ దశలోనూ తెలియనీయలేదని టిడిపి తెలంగాణ నాయకులు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలిస్తే తెలంగాణలో పార్టీ పగ్గాలను రేవంత్ రెడ్డికి అప్పగిస్తామని చంద్రబాబు తన సన్నిహితులతో చెప్పారని అంటారు. కానీ టిడిపి తెలంగాణ నాయకులకు మాత్రం ఆ విషయం చెప్పలేదని సమాచారం.
తాను ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతును సంపాదించగలనని రేవంత్ రెడ్డి చెప్పడంతో వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని, అయితే ఆ పథకాన్ని చంద్రబాబు నాయుడు విస్తరించారని, మరింత మంది ఎమ్మెల్యేలను లాక్కోవడానికి అవసరమైన వ్యూహాన్ని అనుసరించారని అంటారు. చివరకు అది బెడిసికొట్టి రేవంత్ రెడ్డి ఎసిబికి పట్టుబడ్డారు.












Click it and Unblock the Notifications