ఛలో అమెరికా..! రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు అక్కడే..!!
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి హార్డ్ కోర్ అభిమానులకు ఈ వార్త అంతగా రుచించదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డికి వీరాభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఇంటి నుండి కాలు బయట పెడితే చాలు క్షణాల్లో వందలమంది అభిమానులు రేవంత్ రెడ్డి చుట్టూ చేరిపోతుంటారు.
సన్మానాలని, సెల్ఫీలని, షేక్ హాండ్ లని ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. ఈమద్య ప్రగతి భవన్ ముట్టడి సందర్బంగా రేవంత్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న సందర్బంలో కూడా కొంత మంది అభిమానులు పోలీసు పెట్రోలింగ్ వాహనంలో ఉన్న రేవంత్ రెడ్డికి సన్మానం చేసే ప్రయత్నం చేసారు. రేవంత్ రెడ్డికి అంత వీరాభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. ఇంతటి అభిమానులు ఒక అంశంలో మాత్రం కాస్త నిరాశకు లోనవ్వక తప్పదని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన సమక్షంలో ఘనంగా నిర్వహించాలనుకుంటున్న వారికి ఈ సారి కాస్త నిరాశే మిగులుతుంది. నవంబర్ 8న రేవంత్ రెడ్డి పుట్టిన రోజు ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులకు ఆయన అందుబాటులో ఉండడం లేదు. అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి అభిమానుల ఒత్తిడి మేరకు ఈ సారి ఆయన అమెరికాలోని వాషింగ్టన్ వెళ్లనున్నారు. ఈనెల 8,9 తారీఖుల్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడిఎఫ్) 20వ వార్శికోత్సవ వేడుకలకు రేవంత్ రెడ్డిని ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు.
దీంతో ఈ నెల 6వ తారీఖున రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లనున్నారు. కార్యక్రమం తర్వాత మరో మూడు రోజులు అక్కడే బంధు మిత్రులను కలవనున్నారు రేవంత్ రెడ్డి. అంటే జన్మదిన వేడులకను అభిమానులు రేవంత్ రెడ్డి లేకుండానే నిర్వహించుకోవాలన్న మాట. రేవంత్ రెడ్డి వీరాభిమానులు మాత్రం ఈ అంశం పట్ల కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications