బర్త్ డే బాయ్ రేవంత్‌కి కేక్ తినిపించిన చంద్రబాబు, ఉపఎన్నికపై సూచనలు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారంతో 47వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నాయకులంతా కలసికట్టుగా పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడాలని తెలంగాణ టీడీపీ నేతలకు సూచించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆధ్వర్యంలో ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి తదితరులు ఆదివారం చంద్రబాబు నివాసానికి వెళ్లి కలిశారు.
రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో గెలుపునకు గట్టిగా కృషి చేయాలని ఆయన వారికి చెప్పారు. ఇక ఆదివారం రేవంత్ పుట్టిన రోజు అని తెలిసి కేక్ తెప్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి చేత కేక్ కట్ చేయించిన చంద్రబాబు బర్త్ డే బాయ్‌కి కేక్ తినిపించారు.

కాగా, మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో టీడీపీకి శాసనసభాపక్ష ఉపనేతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ కొత్త కమిటీల ప్రకటనలో భాగంగా రేవంత్ రెడ్డికి తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కట్టబెడుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన తర్వాత రేవంత్ రెడ్డి జరుపుకున్న తొలి పుట్టినరోజు ఇదే. అంతక ముందు తన నివాసంలో జరిగిన పుట్టినరోజు వేడుకకు పార్టీ ముఖ్యులనందరినీ ఆహ్వానించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు హాజరైన ఈ కార్యక్రమం వేడుకలా జరిగింది.












Click it and Unblock the Notifications