చంద్రబాబు కోసం ప్రాణాలిచ్చేందుకు ఎందరో: కెసిఆర్‌పై దుమ్మెత్తిపోసిన రేవంత్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన బుధవారం నాడు దుమ్మెత్తి పోశారు. తన తండ్రి భోళా శంకరుడు అన్న ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు.
కవితమ్మా! కెసిఆర్ మీ కుటుంబానికే భోళా శంకరుడు అని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల కోసం కెసిఆర్ చెప్పే మాటలను ప్రజలు ఎవరూ నమ్మవద్దన్నారు. పార్టీ మారనని భార్యాబిడ్డల పైన ఒట్టువేసి మరీ ఎమ్మెల్యే కృష్ణారావు తెరాసలోకి వెళ్లారన్నారు.
టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కోసం ప్రాణాలు ఇచ్చేందుకు తెలంగాణలో వేలాది మంది ఉన్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పదవిని కాపాడుకునేందుకే కెసిఆర్ ఆయుత చండీయాగం చేశారన్నారు. కెసిఆర్, ఆయన కొడుకు కెటిఆర్, అల్లుడు హరీష్ రావు, కూతురు కవిత పదవుల కోసం ఏమైనా చేస్తారన్నారు.

కేంద్రం నిర్లక్ష్యం: జితేందర్ రెడ్డి
మహబూబ్ నగర్లో డబ్లింగ్ పనులను ఆర్వీఎన్ఎల్‌కు అప్పగించడం సరికాదని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వే పైన కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట్రంలో డబుల్, ట్రిపుల్ రైల్ లేన్లు అందటం లేదన్నారు.
రైల్వే బడ్జెట్‌లో ఎక్కువ నిధులు వచ్చేలా చర్యలు
రైల్వే బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని దక్షిణమధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్‌నిలయంలో తెలంగాణ రాష్ట్ర ఎంపీలతో భేటీ అయి బడ్జెట్‌కు సంబంధించి ప్రతిపాదనలు సేకరించారు. రైల్వే లైన్ల పూర్తి, డబ్లింగ్ పనులు, కొత్త రైళ్లు, రైల్వే వంతెనల నిర్మాణం చేపట్టాలని ఎంపీలు ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనల ఆమోదం కోసం రైల్వే బోర్డుకు పంపిస్తామని జీఎం చెప్పారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తామన్నారు.
వచ్చే ఏడాది కేజీ టు పీజీ ఉచిత విద్య: కవిత
వచ్చే ఏడాది నుంచి కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎంపీ కవిత తెలిపారు. సమాజం ముందుకు పోతున్నా మహిళలు ఇంకా బానిసలుగానే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకు నిధులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిధులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications