వందల కోట్లలో కేసీఆర్ బియ్యం కుంభకోణం: సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 8 ఏళ్లుగా సీఎంఆర్ బియ్యం కుంభకోణం సాగుతోందని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోనే లక్ష క్వింటాళ్లు దోచేశారని ట్విటర్ వేదికగా విమర్శించారు. ఒకే జిల్లాలో ఇంత కుంభకోణం జరిగితే... రాష్ట్రంలో ఇంకా ఏ స్థాయిలో దోచుకున్నారోనన్నారు.

బియ్యం కుంభకోణంపై రేవంత్ రెడ్డి డిమాండ్
సీఎం కేసీఆర్‌కు తెలియకుండా ఈ బియ్యం కుంభకోణం సాధ్యమా రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బియ్యం కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించకుండా బీజేపీని ఎవరు ఆపుతున్నారని ఆయన నిలదీశారు. కాగా, ఈ విషయంపై ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ కూడా రాశారు. ఎఫ్‌సీఐ గోదాముల్లో మాయమైన బియ్యంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖ రాశారు.

సీఎంఆర్ కేటాయింపులపై విచారణకు రేవంత్ డిమాండ్
"రాష్ట్రంలో ఏటా రూ. వందల కోట్ల విలువైన ధాన్యం కుంభకోణం జరుగుతోంది. మిల్లర్లతో కుమ్మక్కై కుంభకోణం చేస్తున్నారు. సీఎంఆర్ పేరుతో మిల్లుల్లో జరిగే అక్రమాలపై విచారణ జరపాలి. మిల్లుల్లో బియ్యం రీసైక్లింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి. 2014 నుంచి ఇప్పటివరకు సీఎంఆర్ కేటాయింపులపై విచారణ జరపాలి. అక్రమ మిల్లులను సీజ్ చేసి దోపిడీ సొమ్ము వసూలు చేయాలి. కుంభకోణంలో భాగస్వామ్యమైన టీఆర్ఎస్ నేతలపైనా చర్యలు తీసుకోవాలి. సీబీఐ విచారణ జరిపించి కిషన్‌రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి" ఆ లేఖలో రేవంత్ కోరారు.

అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ లెక్క తేలుస్తామంటూ రేవంత్ వార్నింగ్
మరోవైపు, టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంతేగాకుండా ఖమ్మంలో ఓ కార్యకర్తపై పీడీ యాక్ట్ పెట్టి వేధిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రతి లెక్కా తేలుస్తామని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. గ్రానైట్ వ్యాపారైన ఖమ్మంకు చెందిన ఎండీ ముస్తఫా (39) అనే కాంగ్రెస్ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ముస్తాఫాపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి హైదరాబాద్‌లోని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ ఘటనపైనే రేవంత్ పై విధంగా స్పందించారు.












Click it and Unblock the Notifications