తెలంగాణ ఎఫెక్ట్: బాబును కార్నర్ చేసేందుకు ఛాన్సిచ్చిన రేవంత్ రెడ్డి!
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి... తమ పార్టీని తెరాసలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పైన హైకోర్టు బుధవారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది. తొలుత ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన చర్య తీసుకోవాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏపీలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అవకాశమిచ్చారని చెప్పవచ్చు! తెలంగాణ టిడిపిని తెరాసలో విలీనం చేయడాన్ని రేవంత్ న్యాయస్థానంలో సవాల్ చేశారు. తొలుత ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.
తొలుత ఫిరాయింపుల పైన నిర్ణయం తీసుకోవాలని, అది మూడు నెలల్లో తీసుకోవాలని హైకోర్టు చెప్పడం గమనార్హం. తెలంగాణలో 15 మంది టిడిపి నుంచి గెలిస్తే 12 మంది తెరాసలో చేరారు. ఏపీలో 67 మంది వైసిపి ఎమ్మెల్యేలు గెలిస్తే దాదాపు ఇరవై మంది టిడిపిలో చేరారు.

తెలంగాణ టిడిపిలో విలీనం ప్రస్తావన ఉంది. ఏపీలో విలీనం అంశం ప్రస్తావన లేదు. అయితే, ఫిరాయింపుదారుల పైన మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోను దూకుడు పెంచుతుందని అంటున్నారు.
ఏపీలో దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు వైసిపి నుంచి టిడిపిలో చేరారు. ఇప్పుడు హైకోర్టు తీర్పును (మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించిన నేపథ్యంలో) చూపించి.. ఏపీలో అధికార టిడిపిని వైసిపి, ఆ పార్టీ అధినేత జగన్ మరింత ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన తెలంగాణ స్పీకర్ మధుసూదనా చారి నిర్ణయం తీసుకుంటే.. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు పైన మరింత ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. తెలంగాణలో నిర్ణయం తీసుకుంటే ఏపీలో ఎందుకు తీసుకోరని మరింత బలంగా ప్రశ్నించే అవకాశముంది.












Click it and Unblock the Notifications