రేవంత్ మార్క్ రాజకీయం, సీనియర్లకు చెక్ - తన వద్దే కీలక శాఖలు..!!
సీఎం రేవంత్ అన్ని నిర్ణయాల్లో తన మార్క్ చూపిస్తున్నారు. తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు. సీనియర్లకు ప్రాధాన్యత ఉన్న శాఖలనే ఇచ్చారు. ఇదే సమయంలో మరో నాలుగు ప్రధాన శాఖలను మాత్రం తన వద్దే ఉంచుకున్నారు. కేబినెట్ లో ఇంకా ఆరు స్థానాలు భర్తీ చేయాల్సి ఉండటంతో రేవంత్ నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, రేవంత్ సీనియర్లను కాదని తన వద్దే ఈ శాఖలను ఉంచుకోవటం పైన చర్చ మొదలైంది.
శాఖల కేటాయింపు : తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. సీనియర్లతో కేబినెట్ కూర్పు చేసినా..శాఖల కేటాయింపులో మాత్రం ఆసక్తికరంగా నిర్ణయాలు జరిగాయి. సీనియర్ మంత్రులకు ప్రాధాన్యత ఉన్న శాఖలనే అప్పగించారు. కానీ, పాలనలో కీలకమైన ఇతర శాఖల విషయంలో రేవంత్ నిర్ణయం ఆసక్తి కరంగా మారింది. కీలకమైన హోం శాఖ ముఖ్యమంత్రి రేవంత్ తన వద్దే ఉంచుకున్నారు. మంత్రివర్గంలో మరో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలని రేవంత్ భావించినా..హైకమాండ్ మరి కొంత కాలం ఆగాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ఉన్న మంత్రులకు కేటాయించని శాఖలను త్వరలో కాబోయే మంత్రులకు ఇచ్చే ఆలోచనలో రేవంత్ ఉన్నారా..లేక వాటిని తానే స్వయంగా పర్యవేక్షించాలని భావిస్తున్నారా అనేది ఇప్పుడు చర్చ.

సీఎం వద్దే ఆ శాఖలు : కీలకమైన హోం, విద్యా, మున్సిపల్, ఎస్సీ సంక్షేమం వంటి శాఖలను ఎవరికీ కేటాయించలేదు. హోం శాఖ ఉత్తమ్, సీతక్క లో ఒకరికి ఇస్తారనే ప్రచారం సాగింది. గతంలో వైఎస్సార్ 2009లో మహిళా మంత్రిగా సబితకు హోం శాఖ కేటాయించారు. 2014 వరకు సబిత అదే పదవిలో కొనసాగారు. ఇప్పుడు రేవంత్ తిరిగి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని భావించారు. కానీ హోం శాఖ తన వద్దే ఉంచుకున్నారు. అదే విధంగా మున్సిపల్ శాఖను ఎవరికీ కేటాయించలేదు. విద్యా శాఖ..ఎస్సీ సంక్షేమ శాఖ విషయంలోనూ రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సీఎంగా ఉంటూ ఈ కీలక శాఖలను పర్యవేక్షించటం సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్ లో ఫలితాలను పరిగణలోకి తీసుకొని మున్సిపల్ - హోం శాఖలను సీఎం తన వద్దే ఉంచుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

త్వరలో విస్తరణ : ఎస్సీ సంక్షేమం ఎస్సీ వర్గానికి చెందిన మంత్రికి కేటాయించాలి. కానీ, ఈ మంత్రివర్గంలో ఎస్సీలుగా ఉన్న భట్టికి ఫైనాన్స్, దామోదర రాజనర్సింహకు వైద్య శాఖ కేటాయించారు. అదే విధంగా మైనార్టీ సంక్షేమం అప్పగించేందుకు ప్రస్తుత కేబినెట్ లో ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం లేదు. దీని ద్వారా రేవంత్ ఖచ్చితంగా భవిష్యత్ మంత్రివర్గ విస్తరణ పైన పక్కా లెక్కతో ఉన్నారని స్పష్టం అవుతోంది. విస్తరణలో సీట్లు దక్కించుకొనే వారిని ఇప్పటికే ఖరారు చేయటంతో పాటుగా..వారి శాఖలను ఖరారు చేసిన తరువాత ప్రస్తుత మంత్రులకు శాఖలను కేటాయించినట్లు కనిపిస్తోంది. హైకమాండ్ అనుమతి లభించిన తరువాత కేబినెట్ విస్తరణ..శాఖల పైన రేవంత్ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications