‘అలా చేస్తే ఓడిపోతానా?-కేసీఆర్ చొక్కా పట్టుకుంటా’
రంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేస్తోందని మండిపడ్డారు.
వికారాబాద్ జిల్లాకు అన్యాయం జరిగితే సీఎం చొక్కా పట్టుకుని నిధులు తీసుకొస్తానని చెప్పారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తాండూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
కొడంగల్ నియోజకవర్గాన్ని ముక్కలు చేసి వికారాబాద్‌లో విలీనం చేసి, రేవంత్ రెడ్డిని ఓడించాలనుకోవడం కేసీఆర్ వక్రబుద్ధికి నిదర్శనమని విమర్శించారు. కొడంగల్ ముక్కలు చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి ఓడిపోతాడా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలుస్తానని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. అంతేగాక, రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఒక్కటే పండుగ జరుపుకొంటోందనీ, వేల కోట్లు సంపాదించడానికే తెలంగాణ ఏర్పడినట్లుగా ఉందని ఆరోపణలు చేశారు.
ఎన్నికల ముందు దళితుడిని సీఎం చేస్తానని, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు చేయకుంటే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్‌కు రావణాసురుడిలా ఎన్ని తలలు ఉన్నాయో చెప్పాలని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 90శాతం పార్టీ టిక్కెట్లు యువతకే ఇస్తామన్నారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చి గద్దెనెక్కడం ఖాయమని రేవంత్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications