వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి: 'తెలంగాణ'కు చంద్రబాబు అధికారం!
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా టిడిపి యవ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరో టిడిపి సీనియర్ నేత... ఎర్రబెల్లి దయాకర రావు టీడీపీ శాసన సభా పక్ష నేతగా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. ఐవీఆర్ఎస్ ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన అందరి నుంచి సమాచారం సేకరించారు.
ప్రస్తుతం ఎల్ రమణ తెలంగాణ టిడిపి అధ్యక్షులుగా, ఎర్రబెల్లి టిడిపి శాసన సభా పక్ష నేతగా ఉన్నారు. వారిని అదే స్థానంలో ఉంచాలని టిడిపి అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నారని సమాచారం.

ఇక, ఏపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలతో పాటు అండమాన్ నికోబర్ దీవులకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర కమిటీతో పాటు, మూడు రాష్ట్రాల కమిటీల జాబితాను ఈ నెల 30లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంది.
పార్టీలో పదవుల విషయమై ఏపీ సీఎం చంద్రబాబు శనివారం కూడా కసరత్తు చేశారు. ఆయన పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిచారు. పార్టీ రాష్ట్ర కమిటీల్లో గతంలో 120 మంది ఉన్నారు. ఇప్పుడు తగ్గించే అవకాశముంది.
ఆయా రాష్ట్ర కమిటీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ
ఏ రాష్ట్ర కమిటీ ఆ రాష్ట్రంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని టిడిపి... ముఖ్యంగా చంద్రబాబు భావిస్తున్నారు. తద్వారా... తెలంగాణ కమిటీకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కును కూడా కల్పిస్తారని చెబుతున్నారు.
దీని ద్వారా, ఆయా రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలు, అంతర్గత అంశాలు, ఇతరత్రా విషయాల పైన వేటికి అవే సొంతగా నిర్ణయాలు తీసుకునేలా కమిటీల వ్యవస్థ ఉండనుంది. కేంద్ర కమిటీ జోక్యం అవసరమైన మేరకే ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పుడే తొందరవుతుందనా?
తెలంగాణ టిడిపి అధ్యక్షుడిని కొత్తగా ఎన్నుకుంటారనే వార్తలు వచ్చాక... అందరి చూపు రేవంత్ రెడ్డి వైపు మళ్లింది. ఇటీవల ఆయన వార్తల్లో వ్యక్తి అయ్యారు. అలాగే, సీఎం కెసిఆర్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఓటుకు నోటు కేసు అనంతరం టిడిపి ఆయనను హీరోగా చూపిస్తోంది.
ఇలాంటి సమయంలో కొత్త తెలంగాణ టిడిపి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అవుతారేమోనని అందరు భావించారు. అయితే, అప్పుడే రేవంత్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తొందరపాటు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమయి ఉంటుందని, అందుకే ప్రస్తుతానికి ఆ ఆలోచనను పక్కన పెట్టి ఉంటారంటున్నారు.












Click it and Unblock the Notifications