"కోర్టుల్నే తప్పుదోవ పట్టిస్తున్నారు"- హైడ్రా కమిషనర్ తొలగింపుపై రేవంత్ ఫైర్..!
హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ ను తొలగించాలంటూ తెలంగాణ సీఎస్ కు నిన్న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్.. కోర్టు ఉత్తర్వులపై సమీక్షిస్తామని తెలిపారు. అలాగే ఈ ఉత్తర్వులకు కారణమని భావిస్తున్న భూకబ్జాదారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ పత్రాలతో వీళ్లు కోర్టుల్నే తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో హైకోర్టు పలు కూల్చివేతల విషయంలో జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తొలగించాలంటూ హైకోర్టు సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కబ్జాదారుల్ని కాపాడేందుకు డబ్బు ఖర్చు చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సీఎస్ గా పనిచేసిన సోమేష్ కుమార్ పై 400 కోర్టు ధిక్కారణ కేసులు ఉన్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు.

హైడ్రా అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఓ అతిపెద్ద సంస్కరణ అన్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. దీన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులోనూ హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుందన్నారు. చెరువులు, కుంటలు, నాలాలు కాపాడటమే హైడ్రా పని ఆయన తేల్చిచెప్పేశారు. బతుకమ్మ కుంట కబ్జా చేస్తే ఆయా నిర్మాణాల్ని కూల్చేశామని, దానిపై కోర్టుకు వెళ్లారని, ఎన్ కన్వెన్షన్ ను కూల్చేస్తే దానిపైనే కోర్టుకెళ్లారని, అది ఏమైనా పేదలదా అని ప్రశ్నించారు. హైడ్రాపై ప్రభుత్వానికి ఓ స్పష్టత ఉందని, ఓ అధికారిని ఎక్కడ నియమించాలనే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉంటుందని రేవంత్ గుర్తుచేశారు. తప్పుడు కేసులపై కోర్టుల్లో పోరాడతామని రేవంత్ తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications