జూబ్లీహిల్స్ కు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. నియోజకవర్గంలో 4 వేల ఇళ్లు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది. ఈ మేరకు షేక్ పేట్ డివిజన్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. పారామౌంట్ కాలనీ గేట్-3 నుంచి రోడ్ షో మొదలైంది. గేట్-2, గేట్-1 మీదుగా బృందావన్ కాలనీ వరకు రోడ్ షో సాగింది. అనంతరం ఎంఎస్ అకాడమీ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ ప్రసంగించారు. పదేళ్లుగా జూబ్లీహిల్స్ నియోజక వర్గాన్ని బీఆర్ఎస్ పట్టించుకోలేదని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని నగర ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
"ఈ ఎన్నికలు సెంటిమెంటా..? లేక డెవలప్ మెంటా..? అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో పీజేఆర్ కుటుంబసభ్యులను ఏకగ్రీవం చేయాలని కోరితే కేసీఆర్ ఒప్పుకోలేదు. ఇప్పుడు సెంటిమెంట్ తో బీఆర్ఎస్ నేతలు ఓట్లు అడుగుతున్నారు. బీఆర్ఎస్ నేతలు బెంజ్ కార్లను వదిలేసి ఆటోల్లో తిరుగుతున్నారు. పీజేఆర్ కుటుంబసభ్యులకు క్షమాపణ చెప్పిన తర్వాతే బీఆర్ఎస్ ఓటు అడగాలి. ఎవరు అడగకపోయినా జూబ్లీహిల్స్ కు రూ.4 వందల కోట్ల నిధులు ఇచ్చాం. రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 వేల ఇళ్లు కట్టే బాధ్యత తీసుకుంటాం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంత్రి అజారుద్దీన్, నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా, సేవకులుగా ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడి పోయిందని అన్నారు. జూబ్లీహిల్స్ ను గత బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఎలా ఇచ్చారని బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి అడుగుతున్నారని.. ఎందుకు ఇవ్వొద్దో.. కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు ఇబ్బందులు లేకుండా చూశామని సీఎం రేవంత్ అన్నారు. నవీన్ యాదవ్ ను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. ఫలితాలు నవంబర్ 14 న వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications