పార్కింగ్ సమస్యపై 'ఉబర్' దృష్టి పెట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉబర్ సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన కోరారు. బుధవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలంగాణలో ఉబర్ సంస్థ వ్యాపార కార్యకలాపాలను దారా ఖోస్రోషాహి వివరించారు. హైదరాబాద్ లో ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని.. ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆయన ముందుకు వచ్చారు. భవిష్యత్తులో మరింత విస్తరణకు ఆసక్తి చూపుతున్నట్లు దారా ఖోస్రోషాహి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం ఉండాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటు పై దృష్టి సారించాలని ఉబర్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. మెట్రో స్టేషన్ల దగ్గర తగిన పార్కింగ్ సౌకర్యం లేదని ఆయన తెలిపారు. దీని వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈవీ ఛార్జింగ్ సెంటర్లతో పాటు పార్కింగ్ సెంటర్ల ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి సూచనపై తప్పకుండా అధ్యయనం చేస్తామని ఉబర్ ప్రతినిధి బృందం తెలిపింది.
హైదరాబాద్‌కు సమీపంలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉబర్ ప్రతినిధులకు వివరించారు. 30 వేల ఎకరాల్లో నిర్మించే ఈ సిటీ ప్రపంచంలోనే ప్రత్యేకమైనదన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 500 కంపెనీలను ఫ్యూచర్ సిటీకి ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే పలు సంస్థలు తమ కార్యకలాపాల కోసం ముందుకు వచ్చాయని సీఎం తెలిపారు.
శంషాబాద్ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల దూరంలోనే ఫ్యూచర్ సిటీ ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. గత డిసెంబర్‌లో ఇక్కడ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో 100కు పైగా కంపెనీలు పాల్గొని పెట్టుబడులకు ముందుకు వచ్చాయని వివరించారు.ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి సీఈఓ దారా ఖోస్రోషాహి ఆసక్తి చూపించారు.

ఈ సమావేశంలో ఉబర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) మధు కన్నన్, ఉబర్ ఇండియా & సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నిప్పల్లి నాగ, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications