'సారు రారు': కేసీఆర్‌పై కవిత సరికొత్త పొలిటికల్ అటాక్!
తెలంగాణ రాజకీయాల్లో "సారు రారు" అనే రెండు మాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలకు దూరంగా ఉన్నారంటూ ఆయన కూతురు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని 'తెలంగాణ రక్షణ సేన' ఒక సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని పలు సమస్యలు చుట్టుముడుతున్న వేళ కేసీఆర్ ఎక్కడ ఉన్నారనే ప్రశ్నను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ ప్రచారాన్ని వేగవంతం చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో రూపొందించిన పలు వీడియోల ద్వారా తెలంగాణ రక్షణ సేన ఈ రాజకీయ దాడిని ఉద్ధృతం చేసింది. రైతులు, విద్యార్థులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరేందుకు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్లు ఈ వీడియోల్లో చూపిస్తున్నారు. ప్రజలు ఎంతగా విన్నవించుకున్నా, కేసీఆర్ బయటకు రాకుండా ఫామ్‌హౌస్ గేట్లు మూసేసుకోవడం, ఆ తర్వాత రీసౌండ్‌తో 'సారు రారు' అనే క్యాప్షన్ రావడం ఈ ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

రాష్ట్రంలో వర్షాభావం వల్ల అల్లాడుతున్న రైతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, శాంతిభద్రతల సమస్యలతో ఆందోళన చెందుతున్న మహిళల వాస్తవ సమస్యల ఆధారంగా ఈ ఏఐ వీడియోలను రూపొందించారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా.. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాడాల్సిన కేసీఆర్ గైర్హాజరీని ప్రశ్నించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పిలిస్తే వచ్చే నాయకుడిగా ఉన్న కేసీఆర్, ఇప్పుడు అధికారంలో లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే భావనను కవిత ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి చిహ్నంగా నిలిచిన కేసీఆర్ రాజకీయ చిత్రాన్ని, ఆయన ఫామ్ హౌస్ కేంద్రంగా విమర్శిస్తూ తెలంగాణ రక్షణ సేన సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.














Click it and Unblock the Notifications
