నకిలీ వైద్యుల ఉచ్చులో పడొద్దు.. అప్రమత్తంగా ఉండండి.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి..
వైద్యో నారాయణో హరి అని అంటారు.. వైద్యుడిని దేవుడిగా భావిస్తారు చాలా మంది. అయితే ఇటీవలికాలంలో రాష్ట్రంలో నకిలీ వైద్యులు కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తున్నారు. మిడిమిడి జ్ఞానంతో వాళ్లు చేసే చికిత్సతో ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి నకిలీ వైద్యులు ఈ మధ్య అధికంగా వెలుగులోకి వస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి చేశారు. వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కట్టుబడిన హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్నామని.. తాజాగా నగరంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఈ నకిలీ వైద్యులు ఎలాంటి విద్యార్హతలూ, కనీస వైద్య పరిజ్ఞానం లేకుండా అసలైన వైద్యుల తరహాలోనే నటిస్తూ రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులతో పాటు విచక్షణారహితంగా ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తూ ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారని సజ్జనార్ మండిపడ్డారు. అవగాహనారాహిత్యంతో రోజుల తరబడి మందులు వాడాలని సూచించడంతో ప్రజల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ మేరకు ఇలాంటి మోసగాళ్లపై నిఘా, కఠిన చర్యలు కొనసాగిస్తున్నామని.. ప్రజలు కూడా చికిత్స కోసం వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని కీలక సూచనలు చేశారు.
ప్రజలు తాము వెళ్లే క్లినిక్ లు, ఆసుపత్రుల రిసెప్షన్ వద్ద జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ప్రముఖంగా ప్రదర్శించారో లేదో గమనించాలి. అలాగే వైద్యుల బోర్డులపై పేరు, విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి.

వైద్యుల వివరాలపై ఏమాత్రం సందేహం కలిగినా వెంటనే https://onlinetsmc.in వెబ్ సైట్ లోకి వెళ్లి Doctor Search లో పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వారి వివరాలను సరిచూసుకోవచ్చని.. అక్కడ వివరాలు కనిపించకపోతే వారు నకిలీలని గుర్తించాలని అన్నారు. ఎక్కడైనా నకిలీ వైద్యులు చలామణి అవుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా డయల్ 112 కు లేదా సమీప పోలీస్ స్టేషన్ కు తెలియజేసి అమాయకుల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications