సంధ్య థియేటర్ తొక్కిసలాట.. శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ ఇలా
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై శనివారం సాయంత్రం కిమ్స్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి. శ్రీతేజ్‌కు ఐసీయూలో చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. అతడికి తరచూ జ్వరం వస్తోందని చెప్పారు.
శ్రీతేజ్ గత 11 రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలోనే వెంటిలెటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఎప్పుడు స్పృహలోకి వస్తాడోనని శ్రీతేజ్ కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. పది రోజులు గడిచిపోయినా ఇప్పటికీ అతడు కళ్లు తెరిచి చూడకపోవడంపై శ్రీతేజ్ తండ్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళ ప్రాణాల కోల్పోయిన విషయం విధితమే. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. వెంటనే పోలీసులు అతనికి సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయవడంతో ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటన కేసులో సంధ్య థియేటర్ యజమానితోపాటు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు 14 రోజులు కస్టడీ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
కాగా, ఆ తర్వాత హైకోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. కానీ, బెయిల్ పేపర్లు సరైన సమయంలో చంచల్‌గూడ జైలు అధికారులకు అందకపోవడం, అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తీసుకొచ్చిన బెయిల్ పేపర్లు సరిగాలేకపోవడంతో ఆయన శుక్రవారం అర్ధరాత్రి వరకు జైలులోనే ఉన్నారు. అయితే, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బెయిల్ పేపర్లు జైలు అధికారులు అందాయి.
అర్ధరాత్రి కావడంతో శనివారం ఉదయం అల్లు అర్జున్‌ను జైలు అధికారులు విడుదల చేశారు. దీంతో నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు అల్లు అర్జున్. ఇక్కడ పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలిసి పరామర్శించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు.దీంతో అక్కడ కొంత భావోద్వేగ వాతావరణం నెలకొంది. అక్కడ కూడా పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను కలిసి పరామర్శించారు.












Click it and Unblock the Notifications