సంగీత మామకు గుండెపోటు: 'వాళ్లొచ్చాకే చెబుతాను'.., మల్లారెడ్డి చర్చలు ఇలా..
తన కూతురు పేరిట బోడుప్పల్‌లోని ఓ కాంప్లెక్స్ రిజిస్ట్రేషన్, రూ.1కోటి నగదు డిపాజిట్ చేయాలని కోరినట్లు సమాచారం. భర్త శ్రీనివాసరెడ్డి ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆమె భావిస్తున్నారు.
హైదరాబాద్: నిత్య పెళ్లి కొడుకు శ్రీనివాసరెడ్డి ఉచ్చులో చిక్కుకుని బాధితురాలిగా మిగిలిన సంగీత తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. శ్రీనివాసరెడ్డి, అతని కుటుంబ సభ్యుల నుంచి స్పష్టమైన హామి వచ్చేవరకు తన దీక్ష విరమించబోనని ఆమె చెబుతోంది. శనివారంతో ఆమె దీక్ష ఏడో రోజుకు చేరుకుంది.
గత ఆరు రోజులుగా బోడుప్పల్ లోని సరస్వతి నగర్ లో ఉన్న భర్త శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట సంగీత దీక్ష చేస్తున్నారు. సంగీతకు పలు మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు కూడా మద్దతుగా నిలిచారు. స్వయంగా ఎంపీ మల్లారెడ్డి ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

మరో రెండు రోజులు పట్టవచ్చు:
సమస్య పరిష్కారానికి తాను చొరవ తీసుకుంటానని చెప్పినట్టే.. ఎంపీ మల్లారెడ్డి ఆ దిశగా ముందుకొచ్చారు. జైల్లో ఉన్న శ్రీనివాసరెడ్డితో ఆయన మాట్లాడారు. సంగీత డిమాండ్లను మల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి ముందు పెట్టినట్టు తెలుస్తోంది. మరో ఒకటి, రెండు రోజులు ఆగితే గానీ ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు.

మామకు గుండెపోటు:
సంగీతపై దాడి నేపథ్యంలో భర్త శ్రీనివాసరెడ్డి సహా ఆయన తల్లిదండ్రులు, సోదరుడిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో వారు మేడిపల్లి పోలీసుల ఎదుట లొంగిపోగా.. మామ బాల్ రెడ్డి, మరిది శ్రీనివాసరెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అత్త ఐలమ్మకు మాత్రం బెయిల్ మంజూరు చేయలేదు.
సంగీత మామ పులకండ్ల బాల్ రెడ్డి స్థానిక నాయకులు శుక్రవారం ఉదయం చర్చలు జరపడానికి వెళ్లారు. అయితే గుండెపోటుతో ఆయన యశోద ఆసుపత్రిలో చేరారని అక్కడికి వెళ్లాక తెలిసింది.

వాళ్లొచ్చాకే మాట్లాడుతా:
సంగీత విషయమై తానిప్పుడే ఏమి మాట్లాడలేనని, జైలు నుంచి తన కొడుకు, భార్య వచ్చాకే మాట్లాడుతానని బాల్ రెడ్డి వారితో చెప్పినట్టు తెలుస్తోంది. జైల్లో శ్రీనివాసరెడ్డితో చర్చల అనంతరం సంగీత వద్దకు వెళ్లి మాట్లాడారు ఎంపీ మల్లారెడ్డి. శ్రీనివాసరెడ్డితో మాట్లాడిన విషయాల గురించి ఆమెతో చర్చించారు.

సంగీత డిమాండ్స్:
తన కూతురు పేరిట బోడుప్పల్‌లోని ఓ కాంప్లెక్స్ రిజిస్ట్రేషన్, రూ.1కోటి నగదు డిపాజిట్ చేయాలని కోరినట్లు సమాచారం. భర్త శ్రీనివాసరెడ్డి ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆమె భావిస్తున్నారు. తిరిగి తన వద్దకు వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. సంగీత మామతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications