తెలంగాణలో "పంచాయతీ పోరు".. నామినేషన్ల పర్వం షురూ !
తెలంగాణ రాష్ట్రంలో "పంచాయతీ పోరు"కి రంగం సిద్దమైంది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో.. నేటి ( నవంబర్ 27, 2025 ) నుంచి నామినేషన్ల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతోంది. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లో 4,236 సర్పంచ్, దాదాపు 37 వేల వార్డులకు సంబంధించి ఎన్నికల జరగనున్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు మార్గదర్శకాలు అందాయి. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. దీంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం కనబడుతోంది.
ఇక ఇప్పటికే పలు చోట్ల అభ్యర్థుల ఎంపికపై గ్రామ పెద్దలతో చర్చలు సాగుతుండగా, మరికొన్ని పంచాయతీల్లో ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్లుగా సమాచారం. ఓటర్ల సౌలభ్యం కోసం తొలి విడతకు సంబంధించిన గ్రామాల్లో ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాలు సైతం ప్రదర్శించనున్నారు. మొత్తంగా పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో పూర్తికానున్నాయి. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న జరగనుండగా.. ఉదయం నుంచే ఓటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం తర్వాత లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాల అనంతరం ఉప సర్పంచి ఎన్నిక కూడా అదే రోజు పూర్తి చేయనున్నారు.

సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్..
ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుండగా.. ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు సమయం నిర్దేశించారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఈ నెల 29వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 2న ఫిర్యాదుల స్వీకరణ.. ఉపసంహరణ చివరి తేదీగా డిసెంబర్ 3 ప్రకటించారు. తుది జాబితా & గుర్తుల విడుదల డిసెంబర్ 3 సాయంత్రం జరగనుంది. ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించారు.
నామినేషన్‌కు అర్హతలు & రుసుములు..
- అభ్యర్థి తప్పనిసరిగా 21 సంవత్సరాలు దాటివుండాలి
- అదే గ్రామానికి చెందిన వ్యక్తి కావాలి
- లాభాపేక్షలేని ప్రభుత్వ లేదా నామినేటెడ్ పోస్టుల్లో ఉండకూడదు
నామినేషన్‌కు రుసుములు..
జనరల్ కేటగిరీ: రూ. 2,000
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ. 1,000
ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేత..
ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో ముగ్గురు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో పోటీదారుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications