దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తం: శతాబ్ది రైలింజిన్‌లో జీఎం ట్రావెల్- ట్రాక్ తనిఖీ
సికింద్రాబాద్: దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన ఉదంతం- కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన తీర యావత్ దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘటనలో 275 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 1,000కి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో- దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణికుల భధ్రత విషయంలో కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వంటి విషాదకర ఘటన పునరావృతం కానివ్వకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. సిగ్నలింగ్ వ్యవస్థ, పట్టాల నాణ్యతపై సమీక్ష నిర్వహిస్తోన్నారు. క్షేత్రస్థాయిలో పట్టాల తనిఖీలను చేపట్టారు. ఇప్పటికే పలుసార్లు సమీక్షలను నిర్వహించారు.

తాజాగా పట్టాల తనిఖీలు, రైల్వే స్టేషన్లల్లో సిగ్నలింగ్ వ్యవస్థపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. దీనికోసం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇవ్వాళ ఆయన సికింద్రాబాద్- వికారాబాద్ సెక్షన్‌లో పర్యటించారు. నంబర్ 12026 సికింద్రాబాద్- పుణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలింజిన్‌లో ఆయన ప్రయాణించారు.
లోకో పైలెట్లతో కలిసి వికారాబాద్ వరకు వెళ్లారు. లోకో ఇంజిన్, పైలెట్ల పనితీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్- వికారాబాద్ మధ్య పట్టాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం వరకూ గడిపారు. రైల్వే స్టేషన్‌లోని రిలే రూమ్‌ను సందర్శించారు. సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహణ, పనితీరును స్వయంగా పరిశీలించారు. వాటిని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరంపై స్టేషన్ మాస్టర్ సహా ఇతర అధికారులతో చర్చించారు.

వికారాబాద్ స్టేషన్‌లో ప్రయాణీకుల సౌకర్యాల గురించి అరుణ్ కుమార్ జైన్ ఆరా తీశారు. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ రూమ్, ఇతర సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొందరు ప్రయాణికులతో మాట్లాడారు. వారి నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని అధికారులకు సూచించారాయన.












Click it and Unblock the Notifications