సికింద్రాబాద్‌లో ఈగలు తోలుకుంటున్న వందేభారత్
భారతదేశంలో వందేభారత్ అంటే అదో పెద్ద క్రేజ్ గా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వమే ప్రచారాన్ని ఉధృతంగా చేసి అటువంటి క్రేజ్ ను ప్రజల్లోకి తెచ్చింది. ఈ క్రేజ్ ను రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనేది కేంద్ర పెద్దల ఆలోచన. ప్రవేశపెట్టిన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అందులోని ఛార్జీలు మాత్రం సామాన్యులకు, మధ్యతరగతికి అందుబాటులో లేవు. భారతదేశంలో మధ్యతరగతి జానాభా ఎక్కువ. అందరూ అంబానీలు, అదానీలే ఉండరు. ఉదాహరణకు విశాఖపట్నం నుంచి విజయనగరంకు ఉన్న 60 కిలోమీటర్ల దూరానికి వందేభారత్ లో ప్రయాణిస్తే రూ.450 ఛార్జీ అవుతుంది. ఆ ఛార్జీతో సికింద్రాబాద్ నుంచి సాధారణ సూపర్ ఫాస్ట్ రైలులో న్యూఢిల్లీ వరకు వెళ్లవచ్చు.
80 శాతం సీట్లు ఖాళీ
ఈనెల 16వ తేదీన సికింద్రాబాద్ నుంచి నాగపూర్ మధ్య వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ గా ప్రారంభించారు. 19వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రాగా ఇప్పటివరకు ఆ రైలు కేవలం 20 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. 80 శాతం సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అన్ని బోగీలు ఖాళీయే. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు త్వరగా చేరుకొని ఆర్థిక సంబంధమైన లావాదేవీలు నిర్వహించుకొని సత్వరమే తిరిగి మహారాష్ట్రకు చేరుకునే ఉద్దేశంతో ఈ వందేభారత్ ను తీసుకువచ్చారు. ఇందులో రెండు ఎగ్జిక్యూటివ్ కోచ్ లు ఉంటాయి. ఒక్కోదాంట్లో 88 సీట్లు ఉంటాయి. రెండు కోచ్ లకు కలిపి అంటే ఒక్కో కోచ్ కు 10 మంది చొప్పున 20 మంది ఉంటున్నారు. ఈ రైలు సామర్థ్యం 1440 అయితే 1200 సీట్లు ఖాళీగా ఉంటున్నాయి.

ఇతర వందేభారత్ రైళ్లు అత్యంత రద్దీతో
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, విశాఖపట్నంకు, కాచిగూడ నుంచి బెంగళూరుకు నడుస్తున్న వందేభారత్ రైళ్లు అత్యంత రద్దీతో నడుస్తున్నాయి. ఆక్యుపెన్సీ 90 నుంచి 100 శాతం వరకు ఉంటోంది. వెయిటింగ్ లిస్టులో టికెట్లు ఉంటున్నాయి. సికింద్రాబాద్-నాగపూర్ వందేభారత్ పై ప్రయాణికులు ఆసక్తి చూపడంలేదు. ఛార్జీలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. న్యూఢిల్లీ వెళ్లే ఎన్నో రైళ్లు ఈ మార్గంలో నడుస్తుంటాయి. తక్కువ ఛార్జీతో గంట నుంచి రెండు గంటల తేడాతో గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అలాంటప్పుడు వందేభారత్ కు అంత డబ్బు పెట్టడం అనవసరమనే ఆలోచనలో ప్రయాణికులున్నారు. ప్రస్తుతం కాజీపేట, రామగుండం, బలార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఆగుతోంది. మంచిర్యాల, పెద్దపల్లి, కాగజ్ నగర్ స్టేషన్లలో కూడా హాల్టింగ్ ఇస్తే ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications