కవిత నివాసం వద్ద భారీ బందోబస్తు- హైసెక్యూరిటీ
హైదరాబాద్: టీఆర్ఎస్‌కు చెందిన శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి ఇంకాస్సేపట్లో సీబీఐ అధికారులు చేరుకోనున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమె స్టేట్‌మెంట్‌ను నమోదు చేయనున్నారు. ఈ కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు ఈ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి రానున్నారు. కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానాలను రాబట్టుకోనున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దర్యాప్తులో కవిత ఇచ్చే స్టేట్‌మెంట్ కీలకమౌతుందనే అంచనాలు ఉన్నాయి.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో- కవిత స్టేట్‌మెంట్‌ను నమోదు చేయాలని సీబీఐ అధికారులు ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా అందించిన రిమాండ్ రిపోర్ట్‌లో కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే సీబీఐ నుంచి నోటీసులు రావడం అప్పట్లో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది.

మరోవంక- టీఆర్ఎస్ నాయకులు ఈ నోటీసులపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవి విచారణ కోసం పంపించిన నోటీసులు కావని స్పష్టం చేశారు. 60 సీఆర్పీసీ కింద ఇచ్చిన నోటీసులు కావడం వల్ల వివరణను మాత్రమే తీసుకుంటారని, స్టేట్‌మెంట్‌ను నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిజానికి ఈ నెల 6వ తేదీ నాడే ఈ విచారణ ముగియాల్సి ఉన్న విషయం తెలిసిందే. దీన్ని కవిత వాయిదా వేశారు. ఈ మేరకు రెండు లేఖలు రాశారు. 6వ తేదీకి బదులుగా 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని చెప్పారు.

దీనికి అనుగుణంగా సీబీఐ అధికారులు 11వ తేదీని ఖాయం చేశారు. కవితకు అందజేసిన 14035/06/2022 నోటీసుల్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను ఆమె సీబీఐ అధికారిక వెబ్‌సైట్ నుంచి సేకరించారు. దానికి అనుగుణంగా ఆమె స్టేట్‌మెంట్ ఇవ్వడానికి సన్నద్ధం అయ్యారు. కాగా- ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన డాక్యుమెంట్లల్లో కవిత పేరు ఎక్కడా లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సీబీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు.

కాగా- ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని కవిత నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఈ విచారణను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ ఆందోళన చేపట్టే అవకాశం ఉందంటూ సమాచారం అందిన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె నివాసానికి వెళ్లే మార్గంలో బ్యారికేడ్లను అమర్చారు. కవితకు అనుకూలంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయక్కడ.












Click it and Unblock the Notifications