తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ - సీతక్కకు పిలుపు..!!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై కాంగ్రెస్ గురి పెట్టింది. ఆపరేషన్ ఆకర్ష్ మంత్ర ప్రయోగిస్తోంది. ఇదే సమయంలో పాలనా పరంగానూ రేవంత్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంత..ఇక తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ నియామకం పైన కసరత్తు మోదలైంది. ఏఐసీసీ నుంచి మంత్రి సీతక్కకు పిలుపు వచ్చింది. సీనియర్లు ఢిల్లీలో మకాం వేసారు. కొత్తగా టీపీసీసీ చీఫ్ నియామకం పైన అధికారిక ప్రకటన రానుంది.
ఏఐసీసీ కసరత్తు
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పైన రేవంత్ తుది కసరత్తు చేస్తున్నారు. కొత్తగా చేరే ఆరుగురి పేర్లతో రేవంత్ ఢిల్లీ చేరారు. జూలై 2న మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం పైన అంచనాలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. కొత్త పీసీసీ చీఫ్ నియమించాల్సి ఉంది. సీఎం పదవితోపాటు పీసీసీ చీఫ్ పదవి ఒకరికే ఇవ్వరు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్.. పీసీసీ చీఫ్‌గా ఇన్నాళ్లూ కొనసాగారు. మరొకరికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది.

టీపీసీసీ పీఠం ఎవరికి
కొత్త పీసీసీ చీఫ్ గా బీసీ లేదా ఎస్టీ వర్గానికి ఇవ్వాలని పార్టీ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఎస్టీ వర్గానికి చెందిన మహిళగా మంత్రి సీతక్క పేరు ఏఐసీసీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో బీసీ వర్గానికి ఇవ్వాలని భావిస్తే ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా మరో మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, ఆ మంత్రి ప్రస్తుతం పీసీసీ పదవి తీసుకొనేందుకు సుముఖంగా లేరని సమాచారం. దీంతో, ప్రస్తుతం డిల్లీలో రేవంత్ తో పాటుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క ఉన్నారు. వీరితో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ జత కలువనున్నారు.
రేవంత్ మంత్రాంగం
మంత్రి పదవి కోసం ఆశవాహులు చాలా మంది ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస రెడ్డికి బెర్త్ ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది. తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరారు. 20 మంది వరకు పార్టీలో చేరతారని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. పీసీసీ చీఫ్ నియామకంతో పాటుగా కేబినెట్ విస్తరణ..పార్టీలో చేరికల అంశం పైన హైకమాండ్ తో రేవంత్ చర్చల తరువాత అధికారిక నిర్ణయం వెలువడనుంది.












Click it and Unblock the Notifications