తెలంగాణ సీనియర్ ఐఎఎస్ జయేష్ రంజన్.. అనూహ్య నిర్ణయం
తెలంగాణకు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఐఎఎస్ సర్వీస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇంకా ఏడాది కాలం సర్వీస్ మిగిలివుండగానే ఆయన స్వచ్ఛందంగా వైదొలగనున్నారు. ఇది.. తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. వీఆర్ఎస్ తీసుకోవడానికి గల కారణాలేమిటనేది ఇంకా తెలియరావట్లేదు. వ్యక్తిగత కారణాల వల్లే సర్వీస్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
వీఆర్ఎస్ తీసుకోనున్న రెండో ఐఎఎస్ అధికారి ఆయనే. ఇదివరకు సీనియర్ ఐఎఎస్ అధికారి ఎస్ఏఎం రిజ్వీ.. వీఆర్ఎస్ తీసుకున్న విషయం తెలిసిందే. 2025 అక్టోబర్ లో పదవీ విరమణకు ముందే ఆయన సర్వీసుల నుంచి వైదొలిగారు. మంచి జూపల్లి కృష్ణారావు వైఖరి వల్లే ఆయన తప్పుకోవాల్సి వచ్చిందంటూ అప్పట్లో విమర్శలు తలెత్తాయి. రిజ్వీ వీఆర్ఎస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. జూపల్లిపై విమర్శలు అప్పగించారు. దీన్ని జూపల్లి తోసిపుచ్చారు.

సరిగ్గా ఏడాది కాలంలోనే జయేష్ రంజన్ కూడా వీఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ మెట్రో పాలిటన్ ఏరియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తోన్నారు. తన వీఆర్ఎస్ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు కూడా. వీఆర్ఎస్ కోసం కేంద్రానికి దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. డీఓపీటీ దీన్ని ఆమోదించితే.. ఈ నెల 31వ తేదీన ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ అమలులోకి రావొచ్చు.
1992 బ్యాచ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి.. జయేష్ రంజన్. ఆ బ్యాచ్ లో ఆయనే టాపర్ కూడా. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆయనను తెలంగాణకు కేటాయించింది డీవోపీటీ. పలు కీలక శాఖల్లో వివిధ హోదాల్లో పని చేశారు. పట్టణ, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వ్యవహారాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయా శాఖల్లో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు.
తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడటానికి జయేష్ రంజన్ నిరాకరించారు. ఆయన ప్రైవేట్ హోదాలో ప్రభుత్వంలో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి అంగీకరించలేదు. ప్రస్తుతానికి తనకు ఎటువంటి ప్రణాళికలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తరచూ విమర్శలు గుప్పిస్తుంటారని, వాటిపట్ల జయేష్ రంజన్ కొంత నిరాశకు గురి అయ్యుండొచ్చనే వాదనలు లేకపోలేదు.













Click it and Unblock the Notifications
