తెలంగాణలో భారీగా ఐఎఎస్ బదిలీలు: జయేష్ రంజన్ కూ స్థానచలనం
తెలంగాణకు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఐఎఎస్ సర్వీస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇంకా ఏడాది కాలం సర్వీస్ మిగిలివుండగానే ఆయన స్వచ్ఛందంగా వైదొలగనున్నారు. ఇది.. తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. వీఆర్ఎస్ తీసుకోవడానికి గల కారణాలేమిటనేది ఇంకా తెలియరావట్లేదు. వ్యక్తిగత కారణాల వల్లే సర్వీస్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల మధ్య తెలంగాణలో పలువరు సీనియర్ ఐఎఎస్ అధికారులు బదిలీ అయ్యారు. జయేష్ రంజన్ కు కూడా స్థానచలనం తప్పలేదు. మొత్తంగా వివిధ శాఖలు, విభాగాల్లో పని చేస్తోన్న 12 మంది సీనియర్ ఐఎఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు ఇచ్చారు. జయేష్ రంజన్ వీఆర్ఎస్ తెరపై వచ్చిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది.

- హైదరాబాద్ మెట్రో పాలిటన్ ఏరియా డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్.. అటవీ, పర్యావరణ శాఖకు బదిలీ అయ్యారు. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందాయనకు.
- రవాణా, రోడ్లు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ బదిలీ అయ్యారు. ఆయనను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం. ఆ స్థానంలో కే ఇళంబర్తి నియమితులయ్యారు. రవాణా శాఖ కమిషనర్, పశు సంవర్ధకం, పాడిపరిశ్రమాభివృద్ధి కార్యదర్శిగా కూడా ఆయన పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను పర్యవేక్షిస్తారు.
- యువజన వ్యవహారాలు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ క్రీడ శాఖకు బదిలీ అయ్యారు. అలాగే.. జయేష్ రంజన్ ఎఫ్ఏసీగా వ్యవహరిస్తోన్న హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ గా బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది.
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నవీన్ మిట్టల్ నియమితులయ్యారు.
- రెవెన్యూ (ఎండోమెంట్) శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ బదిలీ అయ్యారు.
- రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అదనపు బాధ్యతలను కేటాయించింది ప్రభుత్వం. బీసీ, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. బీసీ సంక్షేశాఖ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సబ్యసాచి ఘోష్ రిలీవ్ అయ్యారు.
- హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కు అదనపు బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. జయేష్ రంజన్ బదిలీ కావడం వల్ల ఖాళీ అయిన జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ లకు ప్రత్యేక అధికారి స్థానాన్ని కూడా సర్ఫరాజ్ అహ్మద్ భర్తీ చేశారు.
- మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా శృతి అపాయింట్ అయ్యారు.
- తెలంగాణ రైతు డిస్కమ్ సీఎండీ ముషర్రఫ్ అలీ ఫారూఖీ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. అలాగే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. అక్కడున్న సంగీత సత్యనారాయణ మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.
- ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ కు తెలంగాణ రైతు డిస్కమ్ సీఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను కేటాయించారు.












Click it and Unblock the Notifications
