షాబాద్ హత్యల కేసు: సైకో రాజకుమార్ పై 2 లక్షల రివార్డ్, రంగంలో 14 బృందాలు!
రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఆరుగురిని క్రూరంగా హత్య చేసిన ఉన్మాది కేసు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం పోలీసులు 14 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన షాబాద్ నరహంతకుడు పార్వతి రాజ్ కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
రాజ్ కుమార్ కు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు రికార్డ్
హైదరాబాద్, బెంగళూరులోని హోటళ్లు, లాడ్జిలు, దాబాల్లో విస్తృత తనిఖీలను చేపట్టారు. బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లలో సీసీటీవీలలో ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. నిందితుడి కుటుంబ సభ్యులను, సన్నిహితులను ప్రశ్నిస్తున్నారు. చేగూరు రైల్వే ట్రాక్ దగ్గర అతను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి మళ్లీ విరమించుకున్నాడు. దీనికి సంబంధించి రైల్వే ట్రాక్ వద్ద రాజ్ కుమార్ కు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

14 బృందాలతో గాలింపు, ఆచూకీ తెలిపితే 2 లక్షల రివార్డ్
అయితే పోలీసులు ఇప్పటివరకు సైకో రాజ్ కుమార్ ను పట్టుకోలేకపోయారు. దీంతో 14 బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు, రాజ్ కుమార్ ఆచూకీ తెలిపితే రెండు లక్షల రూపాయలు నగదు రివార్డ్ గా ఇస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఇక ఈ కేసులో నిందితుడి కోసం లుకౌట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
మృతదేహాలు మున్సిపల్ ట్రాక్టర్ లో తీసుకురావటంపై స్థానికుల ఆగ్రహం
ఇదిలా ఉంటే ఉన్మాది రాజ్ కుమార్ చేతిలో దారుణ హత్యలకు గురైన బాధితుల మృతదేహాలను పోస్టుమార్టం చేసిన అనంతరం దైవాల గూడ గ్రామానికి తరలించారు. అయితే మృతదేహాలను అంబులెన్స్ లో కాకుండా మున్సిపాలిటీ ట్రాక్టర్ లో వేసి తీసుకురావడం పైన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల బంధువులు నిరసన వ్యక్తం చేశారు.
రోడ్డుపై కూర్చుని ఆందోళన.. సర్పంచ్ సమాధానం చెప్పాలని డిమాండ్
మృతదేహాలను అంబులెన్స్ లో కాకుండా మున్సిపాలిటీ చెత్త వేసే ట్రాక్టర్ లో తీసుకుని రావడంపై స్థానికులు బాధితుల బంధువులు తీవ్రంగా మండిపడ్డారు. గ్రామ రోడ్డు పైన కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. సర్పంచ్ తక్షణం ఘటన స్థలానికి వచ్చి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని శాంతింప చేశారు. సర్పంచ్ ప్రవర్తన పైన లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications