శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు 45 సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్ట్
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇటీవలి కాలంలో వరుసగా బెదిరింపు మెయిల్స్ వస్తున్న నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు ఏకంగా 45 సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు చెన్నైలో శరత్ సుబ్రహ్మణ్యం అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని కస్టడీపై శంషాబాద్ కు తీసుకొచ్చారు. ఇక తమిళనాడు డీఎంకే నాయకులపై ఉన్న వ్యతిరేకతతోనే బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నిందితుడు శరత్ సుబ్రహ్మణ్యం 2025-2026 మధ్యకాలంలో శంషాబాద్ విమానాశ్రయానికి సుమారు 45 బెదిరింపు మెయిల్స్ పంపినట్లు విచారణలో ఎయిర్ పోర్ట్ పోలీసులు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాలకు సుమారు 800 నకిలీ బాంబు బెదిరింపులు పంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కేసు వివరాలను శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ఇతరుల పాత్ర ఏమైనా ఉందా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ఇక షాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి ఇటీవల బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ కు చేరుకున్న విమానంలో బాంబు ఉందని మెయిల్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 47 మంది విద్యార్థులు ఉన్నారు. అంతకుముందు వారం కూడా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
