షాకింగ్ : షేక్‌పేట్ ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య...
హైదరాబాద్‌లోని షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం(జూన్ 17) ఉదయం గాంధీనగర్‌లోని సోదరి నివాసానికి వెళ్లిన ఆయన.. ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల బంజారాహిల్స్ భూవివాదంలో లంచం తీసుకుంటూ సుజాత ఏసీబీ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే ఆమె భర్త అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
అజయ్ మృతదేహాన్ని చిక్కడపల్లి పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. భార్య సుజాత ఏసీబీకి పట్టుబడటంతో.. ఆ అవమానం తట్టుకోలేకనే అజయ్ ఆత్మహత్య చేసుకున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సుజాత ఏసీబీ రిమాండ్‌లోనే ఉన్నారు.

సుజాత ఇంట్లో ఏసీబీ అధికారులు రూ.30లక్షలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ డబ్బుకు సుజాత కుటుంబం సరైన ఆధారాలు,పత్రాలు చూపించకపోవడంతో అధికారులు ఆ మొత్తాన్ని జప్తు చేశారు. సుజాత కూడా అరెస్టవడంతో భర్త అజయ్ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఏసీబీ వేధింపులే తన సోదరుడి ఆత్మహత్యకు కారణమని సోదరి ఆరోపిస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications