ఎంతకు తెగించావ్ రా.. ఒకే ఆటోలో 23 మంది స్కూలు పిల్లలు..
ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశ వ్యాప్తంగానూ రోడ్డు ప్రమాదాల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చినా.. కఠిన చర్యలు తీసుకున్నా రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. బస్సుల్లో ఆటోల్లో ఎక్కువ మందిని ఎక్కించుకోవడం.. తద్వారా ఓవర్ లోడింగ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. త్వరగా గమ్య స్థానానికి చేరుకోవాలన్న కారణంతో బస్సుల్లో.. ఆటోల్లో ఖాళీ లేకపోయినా జనం ఎక్కేస్తుంటారు. అయితే తాజాగా తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఒక్క ఆటోలో సాధారణంగా ఐదు లేదా ఆరుగురు ప్రయాణిస్తారు. కానీ నాగర్ కర్నూల్ పట్టణం కేంద్రంలో ఓ ఆటో డ్రైవర్.. తన ఆటోలో ఏకంగా 23 మంది స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆటోలో 23 మంది పిల్లలతో ఊపిరి ఆడకుండా ఇలా ప్రయాణం చేయడం ఎంత ప్రమాదకరమో తెలిసిందే. ఒకవేళ ఓవర్ వెయిట్ కారణంగా ఆటో అదుపుతప్పి బోల్తా పడితే పెద్ద ప్రమాదం జరిగేది.
ఈ ఆటోను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు.. ఆటోను ఆపి పిల్లల్ని బయటకు దిగమన్నారు. అలా ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. ఆటోలో మొత్తం 23 మంది పిల్లలు ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు కంగుతిన్నారు. ఈ మేరకు ఆటోను సీజ్ చేశారు. ఈ మేరకు పసి పిల్లల ప్రాణాలతో చెలగాటాలు ఆడొద్దని ఆటో డ్రైవర్లకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తే పిల్లల ప్రాణాలకు ప్రమాదం అని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఆటోల్లో తమ పిల్లలను పంపించి ప్రోత్సహించొద్దని కామెంట్స్ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications