నిలిచిపోనున్న సింగూరు, మంజీరా జలాల సరఫరా - హైదరాబాద్ లో ఇక, అప్పటి వరకే...!?
హైదరాబాద్ లో నీటి సంక్షోభం పొంచి ఉంది. నగరానికి దాహార్తి తీరుస్తున్న కీలకమైన సింగూరు, మంజీరా జలాలు త్వరలోనే నిలిచిపోనున్నాయి. ప్రస్తుతమున్న జలాలు మరో 42 రోజులకు మాత్రమే సరిపోనున్నాయి. వర్షాలు కురవక, వరద రాక సింగూరు జలాశయం నీటిమట్టం పెరగలేదు. నీటి విషయంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో, వాటర్‌బోర్డు ప్రత్యామ్నాయ చర్యలు ఎంత వరకు ఫలిస్తాయనే టెన్షన్ కనిపిస్తోంది.
హైదరాబాద్ నగరానికి నీటి కొరత పెరిగే అవకాశం కనిపిస్తోంది. నగరానికి ప్రధాన నీటి వనరుగా ఉన్న సింగూరు, మంజీరా జలాలు మరో 42 రోజుల వరకు సరిపోనున్నాయి. వర్షాలు రాకపోవటం తో భవిష్యత్ పై ఆందోళన పెరుగుతోంది. నవంబరు నెలలో వర్షాలు వస్తాయనే ఆశలు సైతం సన్నగిల్లాయి. దీంతో సింగూరు జలాశయం పూర్తిగా డెడ్ స్టోరేజ్‌కి చేరటం ఈ ఆందోళనకు కారణం గా కనిపిస్తోంది. దీంతో, వాటర్ బోర్డు ప్రత్యామ్నాయంగా కృష్ణా, గోదావరి జలాలను అందించేందు కు ప్రయత్నిస్తోంది. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సూచనల మేరకు ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయంతో సింగూరు జలాశయంలో నీటి మట్టాలను తగ్గించారు. దాదాపుగా 30టీఎంసీల నీటిని కిందకు గతేడాది వదిలేశారు. సింగూరు జలాశయం డ్యామ్, గేట్లు తదితర వాటిని నిపుణులతో పరిశీలించారు. సింగూరు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 523మీటర్లు కాగా, ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 513.320 మీటర్లు నీళ్లు ఉన్నాయి.

వాటర్ బోర్డు ప్రత్యామ్నాయ చర్యలు
మంజీరా సరఫరా నిలిచిపోతే ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్, యూసు్‌ఫగూడ, బోరబండ, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, మూసా పేట్, జగద్గిరిగుట్ట, ఆర్సీపురం, అశోక్‌నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, దీప్తిశ్రీనగర్, బీరంగూడ, అమీన్ పూర్, నిజాంపేట్‌లతో పాటు పలు ప్రాంతాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ ప్రాంతాలకు మంజీరా ఫేజ్-1, ఫేజ్-2 జలాలు సరఫరా అవుతున్నాయి. కృష్ణా జలాలను ప్రస్తుతం సైనిక్ పురి వరకు అందిస్తుండగా, ఆ తర్వాత ప్రాంతాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. ఆ ప్రాంతాలకు గోదావరి జలాలను నిలిపివేసి కృష్ణా జలాలు సరఫరా చేయడానికి చర్యలు చేపట్టారు. సింగూరు, మంజీర నీళ్లు సరఫరా జరిగే ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించనున్నారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో వాల్వ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇలా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.













Click it and Unblock the Notifications
