SLBC టన్నెల్ ప్రమాదం... వీడని ఉత్కంఠ... రెస్క్యూ ఆపరేషన్ లో జరుగుతుందిదే
శ్రీశైలం ఎడమ గట్టు కెనాల్ సొరంగం పైకప్పు కూలి జరిగిన ప్రమాద ఘటనలో ఇప్పటికీ అందులో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు. ఘటన జరిగి నేటికి 12వ రోజు. కేంద్ర రాష్ట్ర బృందాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలకు దిగినప్పటికీ ఇప్పటివరకు ప్రమాద ఘటనలో చనిపోయిన వారి ఆచూకీ దొరకలేదు. టన్నెల్ లోపల నీటిఊట పెద్ద ఎత్తున వస్తూ ఉండడం వల్ల ఇది సహాయక చర్యలకు అవరోధంగా మారుతుంది.
రెస్క్యూ ఆపరేషన్ లో అడుగడుగునా ఇబ్బందులు
బురద, మట్టిని తొలగిస్తున్నప్పటికీ మళ్లీ అవి తిరిగి పేరుకుంటున్నాయి. మట్టిని సొరంగంలో 12వ కిలోమీటర్ వరకు తరలించాల్సి రావడం, పైకప్పు కూలిన చోటు నుండి మట్టిని తరలించటానికి అడ్డుగా విరిగిపోయిన టన్నెల్ బోరింగ్ మెషీన్ భాగాలు ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న సిబ్బందికి ఇది భారంగా మారింది. ప్రస్తుతం ఒక కన్వేయర్ బెల్టు అందుబాటులోకి వచ్చింది.

కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి
సొరంగంలో పైకప్పు కూలిన ప్రదేశంలో ధ్వంసమైన కన్వేయర్ బెల్టు మరమ్మతులు నేడు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రెండు కన్వేయర్ బెల్టులు పూర్తిస్థాయిలో పనిచేస్తే సహాయక చర్యలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంటుంది. మట్టి, బురద, టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలను బయటకు తీసుకురావడం సులభతరం అవుతుంది.
జాగిలాలతో కార్మికుల జాడ కోసం అన్వేషణ.. కొనసాగుతున్న తవ్వకాలు
ఇక కార్మికుల జాడను గుర్తించడం కోసం జాగిలాలతో అన్వేషణ చేపట్టినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. రాడార్ టెక్నాలజీ ద్వారా మెత్తని భాగాలు ఉన్నాయని గుర్తించినచోట ఆరు మీటర్ల ఎత్తున మట్టి పేరుకుపోవడంతో అడుగున ఉన్న వారిని జాగిలం గుర్తించలేకపోతున్నట్టు సమాచారం. జిపిఆర్ సహాయంతో ఐదు అనుమానిత ప్రదేశాలను గుర్తించి తవ్వకాలు చేపట్టినా, రెండు అనుమానిత ప్రదేశాలలో నిరాశ మిగిలింది.
భూకంపాలపై అధ్యయనం చేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ
మిగిలిన మూడు చోట్ల ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక ఒకచోట కుళ్ళిన వాసన రావడంతో అక్కడ తవ్వకాలను ముమ్మరం చేశారు రెస్క్యూ టీం. ఇదిలా ఉంటే టన్నెల్ కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు అవకాశం ఉందా అన్న అంశం పైన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే సొరంగాన్ని సందర్శించిన ఈ బృందం దీనిపైన అధ్యయనం చేసే రిపోర్ట్ ఇవ్వనుంది.
మృత దేహాల వెలికితీతకు ఇంకా సమయం
మరోవైపు సహాయక చర్యల పురోగతిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సమీక్ష నిర్వహించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఏది ఏమైనా తాజా పరిస్థితులను బట్టి ఎస్ ఎల్ బి సి టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతదేహాలను బయటకు తీయడానికి మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications