హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో..!
హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకరమైన ఘటన జరిగింది. ప్రియుడి చేతిలో మోసపోయి మనస్తాపం చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ పరిధిలోని చంద్రనాయక్ తండాలో తాను ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకొని సూసైడ్ కు పాల్పడింది. మృతురాలు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అర్చన చౌదరి మాలిక్(29)గా గుర్తించారు. ఆమె మైండ్ స్పేస్ లోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతికి గల అసలైన కారణాలను అన్వేషించే పనిలో ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కు చెందిన అర్చన చౌదరి మాలిక్ అనే మహిళకు అప్పటికే వివాహం అయింది. అయితే భర్తతో విభేదాలతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు మాదాపూర్ లోని చంద్ర నాయక్ తాండా లోని ఆర్ సద్గురు రెసిడెన్సీలో ఒంటరిగా నివాసం ఉంటోంది. అయితే అదే సమయంలో తనతో పాటు పనిచేస్తున్న విమల్ అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తోంది. విమల్ సొంతూరు ఉత్తరాఖండ్.. అయితే తనను వివాహం చేసుకోవాలని అర్చన కొద్దికాలంగా విమల్ ను కోరుతూ వస్తోంది.
ఈ క్రమంలో శనివారం రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత సుమారు 2 గంటల 30 నిమిషాల సమయంలో ఒక ఫంక్షన్ కు వెళ్లిన విమల్ కు అర్చన వీడియో కాల్ చేసింది. ఈ మేరకు సీలింగ్ ఫ్యాన్ కు దుపట్టా కట్టి ఉంచి.. తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడింది. దాంతో ఆందోళనకు గురైన విమల్ వెంటనే ఆమెకు తిరిగి ఫోన్ చేసినప్పటికీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో విమల్.. చాలా కంగారుగా వారి ఫ్లాట్ కు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే రూమ్ లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. అర్చనను ఎంత పిలిచినా తలుపు తీయక పోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు విమల్. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు.

పోలీసులు లోపలికి వెళ్లి చూడగా అప్పటికే అర్చన సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఇక పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఈ ఘటనపై సెక్షన్ 194 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications
